Telugu Gateway
Andhra Pradesh

కాంగ్రెస్ తో పొత్తుకూ చంద్రబాబుది రెండుకళ్ల సిద్ధాంతమేనా!

కాంగ్రెస్ తో పొత్తుకూ చంద్రబాబుది రెండుకళ్ల సిద్ధాంతమేనా!
X

రెండు కళ్ల సిద్ధాంతం. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబే కనిపెట్టారు. ఇప్పుడు ఆయన మళ్ళీ దాన్ని బయటకు తీయబోతున్నారా?. అంటే ఖచ్చితంగా ఔననే సమాధానం వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో దీన్ని చంద్రబాబు బాగా వాడారు. ఇప్పుడు మళ్లీ అదే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ఈ ఫార్ములాను బయటకు తీస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు టీడీపీ తెలంగాణ శాఖ నిర్ణయం ప్రకారం..ప్రజల అబీష్టం ప్రకారం ఉంటుంది అట. అంటే ప్రజలు ఎవరితో పొత్తు పెట్టుకోవాలో కూడా పార్టీలకు చెబుతారా?. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు బట్టలూడేలా తంతారని ఏకంగా సొంత కేబినెట్ లోని మంత్రులే వ్యాఖ్యానించటంతో చంద్రబాబు ఈ మధ్య ఆత్మరక్షణలో పడ్డారు. తర్వాత కెఈ లాంటి వారు అయితే తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరంలేదని..ఏపీలో మాత్రం పొత్తుకు ససేమిరా అని ప్రకటించారు. అంటే కాంగ్రెస్ వ్యతిరేక మూలాలపై పుట్టిన పార్టీ ఒక రాష్ట్రంలో ఒక రకంగా..మరో రాష్ట్రంలో మరో రకంగా ఉంటుందా?. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటానికి అభ్యంతరం లేనప్పుడు ఏపీలో మాత్రం ఎందుకు వస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తే వద్దు అంటే...అది ఓ పద్దతి.

కానీ ఓ రాష్ట్రంలో ఓకే..కానీ ఏపీలో మాత్రం వద్దు అంటే ప్రజలు హర్షిస్తారా?. ఇది ద్వంద ప్రమాణాల పాటించటం కాదా?. అధికార టీఆర్ఎస్ అందరినీ షాక్ కు గురిచేస్తూ ఒకేసారి 105 సీట్లను ప్రకటించటంతో ఇప్పుడు టీడీపీ ముందున్న ఆప్షన్స్ కాంగ్రెస్ తో కలవటం తప్ప మరేమీ లేదని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో కలిస్తే కాంగ్రెస్ తో కలవాలి. లేదంటే టీజెఎస్..వామపక్షాలతో కలసి ముందుకు సాగాలి. కాంగ్రెస్ తో కలిస్తే తప్ప..కాస్తో కూస్తో సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఒంటరిగా బరిలోకి దిగే సీన్ కూడా లేదు. ఈ మధ్య ఏపీ మంత్రి నారా లోకేష్ తెలంగాణలో అన్ని సీట్లకు పోటీచేస్తామని ఓ గొప్ప ప్రకటన అయితే మాత్రం చేశారు. కానీ వాస్తవం వేరు. ప్రజలు ఏమంటే మాకేంటి అని టీడీపీ మాత్రం కాంగ్రెస్ తో జట్టు కడితే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో మాత్రం సత్తా చాటే ఛాన్స్ ఉంది. అయితే సమయం అతి తక్కువ ఉన్నందున ఈ పొత్తుల..సీట్ల సర్దుబాటు ఎంత మేర సాఫీగా సాగుతాయన్నది కూడా కీలకంగా మారనుంది.

Next Story
Share it