Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘ఆదర్శ రాజకీయాలు’!

చంద్రబాబు ‘ఆదర్శ రాజకీయాలు’!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దూరం జరిగారు. కారణాలు ఏమైనా టీడీపీ మోడీకి దూరం జరిగింది. దీంతో రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఒంటరి అయ్యారు. ఉన్న వామపక్షాలు కూడా చంద్రబాబుపై గుర్రుగానే ఉన్నాయి. ఏ దశలోనూ అవి అధికార టీడీపీతో కలసి ముందుకు సాగటానికి ఆసక్తిగా లేవు. మరి ఒంటరిగా చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించగలరా? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్న తరుణంలో చంద్రబాబుకు తోడు దొరికింది. అది కూడా రాహుల్ గాంధీ రూపంలో. నిన్న మొన్నటి వరకూ ఏపీ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు. సాక్ష్యాత్తూ ఆ పార్టీ ఎంపీ కె వీ పీ రామచంద్రరావు అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేవలం కమిషన్ల కోసమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును రాష్ట్రం టేకప్ చేసిందని ఆరోపించారు. మంగళవారం నాడు కర్నూలులో పర్యటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రధాని మోడీ అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ అదే ఆయన పర్యటించిన ఏపీకి చెందిన అధికార పార్టీ అవినీతి గురించి కనీసం మాటమాత్రంగా కూడా ప్రస్తావించలేదు.

మోడీ అవినీతి తప్పు అయినప్పుడు..చంద్రబాబునాయుడు చేసే అవినీతి ఒప్పు ఎలా అవుతుంది?. లేదు తమకు కాబోయే మిత్రుడు కాబట్టి చంద్రబాబు అవినీతికి ‘మినహాయింపు’ పథకం ఏమైనా వర్తింపచేశారా రాహుల్ గాంధీ?. రాహుల్ పర్యటన తీరు...ఆయనపై కనీసం టీడీపీ నేతలు కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదంటే వీరిద్దరి కాంగ్రెస్, టీడీపీల ‘సఖ్యత’ ఎలా ఉందో అర్థం అవుతూనే ఉంది. ఈ లెక్కన చంద్రబాబుకు ఏపీలో రాజకీయంగా రాహుల్ గాంధీ తోడు దొరికినట్లు అయింది. అంటే వైఎస్ హయాంలో తీవ్ర విమర్శలు చేసిన కెవీపీ రామచంద్రరావుతో చంద్రబాబు భవిష్యత్ లో కలసి పనిచేయబోతున్నారన్న మాట?. ఎంతైనా చంద్రబాబు రాజకీయాలు ‘అందరికీ ఆదర్శవంతం’.

Next Story
Share it