Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘ఇంటెలిజెన్స్’ అంతేనా?!

చంద్రబాబు ‘ఇంటెలిజెన్స్’ అంతేనా?!
X

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రతి పాలనలోనూ ‘ఇంటెలిజెన్స్’ ఘోర వైఫల్యాలే. పాలనలో అసలు తనను మించిన వారు లేరు అని చెప్పుకునే ఆయనకు ఇంటెలిజెన్స్ వైఫల్యాలు పెద్ద మచ్చగా మిగిలాయి. అది ఎంతగా అంటే ఏకంగా అలిపిరిలో ముఖ్యమంత్రి కాన్వాయ్ కిందే బాంబు పెట్టినా కనుక్కోలేనంత వైఫల్యం. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివశంకర్ పై సొంత పార్టీ నేతలు..మంత్రులే తీవ్ర విమర్శలు చేశారు అప్పట్లో. ఇప్పడు కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్న రేవంత్ రెడ్డి ని ట్రాప్ వేసి మరీ ఓటుకు నోటు కేసులో పక్కాగా వీడియోలతో సహా ఇరికించే వరకూ ఏ మాత్రం గుర్తించలేకపోయారని అప్పటి ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏఆర్ అనురాధపై బదిలీ వేటు వేశారు. తర్వాత అయినా ఏమైనా మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. తుని రైలు ఘటనతోపాటు ఇటీవల సచివాలయంలో నాయి బ్రాహ్మణణులు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో వాదనకు దిగే వరకూ పట్టించుకోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ. తాజాగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల కాల్పుల్లో మరణించటంతో ఏపీ ఇంటెలిజెన్స్ పై మరోసారి తీవ్ర స్థాయి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటెలిజెన్స్ ను చంద్రబాబు కేవలం తన రాజకీయ అవసరాల కోసం వాడుతున్నారు తప్ప..వారు చేయాల్సిన అసలు పనిని ఏ మాత్రం పట్టించుకోవటం లేదని టీడీపీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ నేతలు అయితే ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో ఆయన పాత్ర ఉందని..ఆయన అచ్చం ఇదే పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ తీరుపై ఏ మాత్రం సంతృప్తికరంగా లేరు. నిత్యం ఆయన ఎంతసేపూ తాము ఏమి చేస్తున్నది..ఎవరితో కలుస్తున్నది వంటి వివరాలపైనే ఫోకస్ పెడుతున్నారు కానీ..అసలు విషయాలను పట్టించుకోవటంలేదని చెబుతున్నారు. నిత్యం చంద్రబాబుతో ఉంటూ పార్టీ నేతలపై ఫీడ్ బ్యాక్ ఇవ్వటం తప్ప..అసలు ‘ఇంటెలిజెన్స్’ను వదిలేశారని చెబుతున్నారు. మొత్తానికి ప్రతి సారి చంద్రబాబు ప్రభుత్వంలో ‘ఇంటెలిజెన్స్’ వైఫల్యాలు కామన్ అయిపోయాయని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it