Telugu Gateway
Andhra Pradesh

ప్రజల సొమ్ముతో ‘చంద్రబాబు పండగ’

ప్రజల సొమ్ముతో ‘చంద్రబాబు పండగ’
X

సెట్ టాప్ బాక్స్ ల ప్రాజెక్టు కోసం మొత్తం4 వేల కోట్ల అప్పు

రాజధాని నిర్మాణానికి నిధుల్లేవు. అందుకే ఎక్కువ వడ్డీకి అయినా బాండ్స్ అమ్మి నిధులు తెచ్చుకున్నాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోగలరు. ఇవీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణలు చేసిన, చేస్తూ ఉన్న భీషణ ప్రతిజ్ణలు. ఏపీ ప్రజలకు అత్యవసరం రాజధాని భవనాలు..ఆస్పత్రుల్లో సౌకర్యాలా?. మంచి నీటి వసతుల కల్పానా?. గుంతలు పడి ఉన్న గ్రామీణ రహదారులను బాగుచేయటమా?. లేక సెట్ టాప్ బాక్స్ లా?. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సెట్ టాప్ బాక్స్ లు, ఈ ప్రాజెక్టు కోసం 3283 కోట్ల రూపాయల మొత్తం బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి అప్పు చేయాల్సిన అవసరం ఉందా?. అంటే ఖచ్చితంగా అవుననే చెబుతోంది చంద్రబాబు సర్కారు. ఫైబర్ గ్రిడ్ నెట్ వర్క్ అప్ గ్రేడేషన్ తో పాటు కొత్తగా 68 లక్షల సెట్ టాప్ బాక్స్ ల కొనుగోలు కోసం ఏకంగా 3283 కోట్ల రూపాయలు రుణం తెచ్చుకునేందుకు ఏపీ సర్కారు గ్యారంటీ ఇఛ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

గతంలో ఓ సారి 300 కోట్ల రూపాయలు, మరోసారి 411 కోట్ల రూపాయలు రుణ సేకరణకు సర్కారు గ్యారంటీ ఇఛ్చింది. ఈ లెక్కన కేవలం ఒక్క ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసమే ఏపీ సర్కారు ఏకంగా ఇప్పటివరకూ మొత్తం 4000 కోట్ల రూపాయల అప్పు కు గ్యారంటీ మంజూరు చేసింది. ఇప్పటికే ఈ నెట్ వర్క్ కింద కేవలం 20 లక్షల కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉండగా..ఇప్పటి వరకూ నిండా మూడు లక్షల కనెక్షన్లు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ సామర్ధ్యాన్ని ఏకంగా 12.5 మిలియన్లు అంటే (1.25 కోట్ల) సబ్ స్క్రైబర్ల సంఖ్యకు పెంచుతారు అంట. ఓ సారి ఈ ప్రాజెక్టు అమలు కోసం చైనా నుంచి నాసిరకం సెట్ టాప్ బాక్స్ లు దిగుమతి చేస్తూ చెన్నయ్ పోర్టులో ఆ ప్రాజెక్టు అమలు కాంట్రాక్టర్ పట్టుపడ్డారు. ఇప్పటికే ఏపీలో చాలా మంది వినియోగదారులు డీటీహెచ్ సౌకర్యాలను వినియోగిస్తున్నారు. ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. మరి వాళ్లు అంతా చంద్రబాబు అప్పు చేసి ప్రాజెక్టు అమలు చేస్తున్నారని ఉన్న కనెక్షన్లు తీసేసి ఫైబర్ గ్రిడ్ కు మారతారా?. అదీ వాయిదాల కింద వడ్డీ చెల్లింపునకు సిద్ధపడతారా?.

ఫైబర్ గ్రిడ్ కింద తీసుకున్న కనెక్షన్లు ఇప్పటికే చుక్కలు చూపిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఫైబర్ గ్రిడ్ కింద టీవీల్లో వచ్చే కార్యక్రమాలు నాసిరకంగా ఉండటంతోపాటు...పలు సమస్యలు సృష్టిస్తుండటంతో చాలా మంది కనెక్షన్లు వదిలేస్తున్నారు కూడా. ఇంత జరుగుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా చంద్రబాబునాయుడు ప్రజల సొమ్ముతో పండగ చేసుకుంటున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఓ పెద్ద స్కామ్ గా మారిందని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. కేవలం దోపిడీకే దీన్ని డిజైన్ చేశారని..లేదంటే ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి ఇంత ప్రాధాన్యత అవసరం ఉందా? అనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it