‘అమరావతి’ నిర్మాణం దేవాన్ష్ కు అప్పగిస్తే పోలా!
పని తక్కువ. ప్రచారం ఎక్కువ. ఈ అంశంపై దేశంలో పోటీ నిర్వహిస్తే అందులో ఫస్ట్ ప్రైజ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వస్తుందనటంలో సందేహం లేదు. వారం వారం పోలవరం..సోమవారం పోలవారం అంటూ హంగామా చేశారు మూడేళ్లు. ట్రాన్స్ స్ట్రాయ్ ఉన్నంత కాలం అసలు పనులు సూపర్...బంపర్ అంటూ ఊదరగొట్టారు. చేయని పనులకు కూడా చెల్లింపులు చేసి దోచుకున్నారు. తర్వాత రేట్లు సరిపోకపోతే ఏ కాంట్రాక్టర్ అయినా ఎందుకు చేస్తారని అంటూ..అస్మదీయ కంపెనీని తెచ్చిపెట్టుకున్నారు. ప్రాజెక్టు పూర్తి కంటే ఈ భారీ ప్రాజెక్టులో ఎంత దోపిడీ చేయవచ్చో అన్న స్కెచ్ పైనే చంద్రబాబు మక్కువ ఎక్కువ అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకు సాక్ష్యాలు కూడా బయటకు వస్తున్నాయి. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారనటానికి ఉదాహరణలు ఎన్నో. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ దేవాన్ష్ ను తెరపైకి తెచ్చారు చంద్రబాబు. ‘ఏం చేస్తున్నావంటే మా మనవడు పోలవరం కడుతున్నా తాతా’ అని సమాధానం ఇఛ్చాడట.’ దేవాన్ష్ కు కూడా పోలవరం చూడాలన్న కోరిక ఉంది. పిల్లలకు కూడా పోలవరం కట్టాలన్న పట్టుదల ఉంది అని చంద్రబాబు చెబుతున్నారు.
అసలు దేవాన్ష్ వయస్సు పిల్లలకు పోలవరం ప్రాజెక్టు..దాని ప్రాధాన్యత..అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలిసే అవకాశం ఉంటుందా?. పిల్లల పేర్లు చెప్పి కూడా ఇంత చిల్లర రాజకీయం ఎందుకు?. ఎలాగూ నాలుగున్నర సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి శాశ్వత భవనాల నిర్మాణ పనులు మొదలుపెట్టడం కూడా చేతకాలేదు. పోలవరం తరహాలోనే అమరావతి పనులు దేవాన్ష్ కు అప్పగిస్తే అయినా కనీసం కొంత స్పీడ్ గా ఆ పనులు అయినా పరుగులు పెడతాయేమో చూడాలి. ఈ సూపర్ టెక్నాలజీ యుగంలో డిజైన్ల ఖరారుకే చంద్రబాబు మూడు సంవత్సరాల పైగా సమయం తీసుకుని కొత్త చరిత్ర సృష్టించారు. గతంలోనూ ఇలాగే ఏ తాత అయినా మనవడితో ఆడుకోవాలని చూస్తాడు. కానీ నేను ఇవన్నీ వదిలేసి రాష్ట్రం కోసం తెగ కష్టపడిపోతున్నట్లు కలరింగ్ ఇచ్చుకున్నారు. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ దీ ఇదే వరస. ఫ్యామిలీలను త్యాగం చేసి ప్రజల కోసం కష్టపడుతున్నట్లు చెప్పుకుంటూ ప్రచారం పొందాలని చూడటం. అంత కష్టం ఎందుకు? ఎవరు అడుగుతున్నారు కష్టపడమని. ఇప్పటికే ప్రభుత్వంలో చేయాల్సినన్ని స్కామ్ లు చేసుకున్నారుగా..రెస్ట్ తీసుకోండి మరి.