Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు..సీక్రెట్ బాండ్స్ !

చంద్రబాబు..సీక్రెట్ బాండ్స్ !
X

‘బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(బిఎస్ఈ)లో అడగండి అమరావతి బాండ్స్ లో పెట్టుబడి పెట్టింది ఎవరో చెబుతారు. మేం మాత్రం చెప్పం. ఇదీ ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విలేకరుల సమావేశం పెట్టి మరీ చేసిన వ్యాఖ్య ఇది. కానీ అమరావతి బాండ్స్ ఎవరెవరు కొనుగోలు చేశారో ఆ వివరాలు ఇస్తారా? అని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ప్రతినిధి యతిన్ పాడియాని అడిగితే .. ఆ ఛాన్సేలేదని తేల్చిచెప్పారు. సమాచార హక్కు చట్టం కింద కూడా ఇచ్చే అవకాశం ఉండదన్నారు. ఇస్తే గిస్తే ఆ వివరాలు ఏపీ ప్రభుత్వం ఇవ్వాలని స్పష్టం చేశారు. దేశంలో అత్యధిక వడ్డీ రేట్లకు విక్రయించిన ఈ బాండ్లలో ఎవరి అవినీతి సొమ్ములేకపోతే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బాండ్లను కొనుగోలు చేసిన సంస్థల పేర్లు బహిర్గతం చేయటం లేదు. ఎందుకు సీక్రెట్ గా ఈ పేర్లను ఉంచాల్సి వస్తోంది. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతుందో తెలుసుకునే హక్కు ఏపీ ప్రజలకు లేదా?. అత్యధిక వడ్డీ రేటు ఇస్తూ అదేదో తన బ్రాండ్ ఇమేజ్ వల్లే బాండ్స్ ఇష్యూ సక్సెస్ అయిందని చంద్రబాబు ప్రచారం అయితే చేసుకుంటున్నారు.

కానీ బాండ్స్ ఎవరు కొన్నారనే విషయాన్ని మాత్రం గుట్టుగా పెడుతున్నారు. పైగా కుటుంబరావు ఈ బాండ్స్ కొనుగోలు చేసిన వారికి వడ్డీ రాయితీ రాదని తెగ ఫీల్ అయిపోతున్నారు. ప్రజలపై పడే వడ్డీ భారం కంటే వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన వారిపై జాలి చూపిస్తున్నారంటే దీని వెనక చీకటి కోణాలు లేవని నమ్మోచ్చా?. అసలు మా ప్రభుత్వంలో అవినీతే లేదు..అంతా పారదర్శకం అని చెప్పుకునే చంద్రబాబు అండ్ కో ఆ బాండ్స్ కొనుగోలుదారుల పేర్లు చెప్పి తన ‘నిప్పు’ చరిత్రను నిరూపించుకోవచ్చు కదా?. కానీ అవేమీ చేయకుండా బాండ్స్ కొనుగోలుదారుల వివరాలు అడిగిన వారిపై సర్కారు ఎదురుదాడి చేస్తోంది. అంతే కాదు..బాండ్స్ లిస్టింగ్ ఈవెంట్ కు కూడా చంద్రబాబునాయుడు కోటి రూపాయలపైనే ఖర్చు పెట్టారంటే చంద్రబాబు ఘనత గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాల్సిందే.

Next Story
Share it