Telugu Gateway
Andhra Pradesh

ఈడీ ఛార్జిషీట్ లో వైఎస్ భారతి పేరు

ఈడీ ఛార్జిషీట్ లో వైఎస్ భారతి పేరు
X

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ కు ఊహించని షాక్. ఇప్పటికే ఆయన ఈ కేసుల వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఇప్పుడు ఏకంగా ఆయన భార్య భారతి పేరును కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఓ ఛార్జిషీట్ లో పేర్కొనటం విశేషం. భారతీ సిమెంట్స్‌ లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల అభియోగ పత్రం (చార్జిషీటు) దాఖలు చేసింది. సీబీఐ తన ఛార్జిషీట్ లో ఎక్కడా భారతి పేరును ప్రస్తావించలేదు. ఈడీ మాత్రం ఆమె పేరును పేర్కొనటం విశేషం. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలు చేశారు.

ఛార్జిషీట్ ను విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. భారతి పేరున ఉన్న్ బ్యాంకు డిపాజిట్లు, నగదు నిల్వల ఆధారంగానే ఈ కేసు దాఖలు అయినట్లు సమాచారం. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈడీ తన చాకం.షీటులో జగన్‌, భారతితోపాటు ఆడిటర్‌, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి, భారతి సిమెంట్స్‌ కార్పొరేషన్‌, జెల్లా జగన్‌మోహన్‌ రెడ్డి (జేజే రెడ్డి), సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌, క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి పవర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యూటోపియా ఇన్‌ఫ్రా, హరీశ్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగతవ్‌ సన్నిధి ఎస్టేట్స్‌తోపాటు గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, ఐబీఎంకు చెందిన వి.ప్రభు షెట్టార్‌, మాజీ ఐఏఎస్‌ కృపానందం, గనుల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర నారాయణను నిందితులుగా పేర్కొంది.

Next Story
Share it