Telugu Gateway
Andhra Pradesh

యనమల ‘పన్ను’ అంత కాస్ట్లీనా!

యనమల ‘పన్ను’ అంత కాస్ట్లీనా!
X

హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ఆస్పత్రిలో ఆ పని చేయిస్తే 25 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఖర్చు 10 నుంచి 15 వేల రూపాయల్లోపే అయిపోతుంది. ఓ వైపు ఏపీని హెల్త్ క్యాపిటల్ గా చేస్తామని..ఏదేదో చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఉపన్యాసాలు దంచేస్తారు. కానీ సాక్ష్యాత్తూ చంద్రబాబు కేబినెట్ లోని సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు అటు ఏపీలోని వైద్యాన్ని..హైదరాబాద్ వైద్యాన్ని కూడా నమ్మటం లేదా?. వైద్యం కోసం హైదరాబాద్ కు అయితే విదేశాల నుంచే వస్తారు. కానీ యనమల మాత్రం తెలుగు రాష్ట్రాలను పూర్తిగా విస్మరించేసినట్లు కన్పిస్తున్నారు. లేదంటే దేనికైనా సింగపూర్ నే ఆదర్శంగా తీసుకోవాలనే చంద్రబాబు మోడల్ నే ఫాలో అవుతున్నారా?. చూస్తుంటే ఇదే నిజం అన్పిస్తోంది.

పంటికి రూట్ కెనాల్ అనేది చాలా మామూలు విషయం. ఈ పని ఏ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్లినా అట్టే చేసేస్తారు. కాకపోతే వరసగా మూడు సిట్టింగ్ లు ఉంటాయి. అయితే ఘనత వహించిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అదే పంటి రూట్ కెనాల్ కోసం ఏకంగా సర్కారు ఖజానా నుంచి ఏకంగా 2,88,823 రూపాయలు ఖర్చుపెట్టారు. అది కూడా సింగపూర్ లో సుమా. ఈ బిల్లు ప్రస్తుతం ఏపీలో అధికార వర్గాల్లో ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏదో అరుదైన వైద్యం కోసం సింగపూర్ వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చని..పంటి రూట్ కెనాల్ పై ఏకంగా ఓ మంత్రి దాదాపు మూడు లక్షల రూపాయల వ్యయం చేయటం అంటే సర్కారు సొమ్మును ఎలా వాడేస్తున్నారో తెలుస్తుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. మంత్రుల వైద్య ఖర్చులపై సీలింగ్ లేదు. అయినా సరే 25 వేల ఖర్చయ్యే వైద్యానికి మూడు లక్షల దాకా వ్యయం చేయటమే విచిత్రం అంటున్నారు.

Next Story
Share it