Telugu Gateway
Telangana

టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!

టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
X

అదిగో అమ్మ‌కం..ఇదిగో అమ్మ‌కం అంటూ ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రిగిన తెలుగు నెంబ‌ర్ వ‌న్ ఛాన‌ల్ టీవీ9 సేల్ పూర్తి అయింది. ఈ డీల్ విలువ 500 కోట్ల రూపాయ‌లుగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. ఈ డీల్ కు సంబంధించిన ఒప్పందాల‌పై ఇప్ప‌టికే సంత‌కాలు అయిపోయాయి. బుధ‌వారం నాడు కొంత న‌గ‌దు బ‌దిలీ కూడా జ‌ర‌గ‌నుంది. టీవీ9 వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీనిరాజు ఎప్ప‌టి నుంచో ఈ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికి అది పూర్తి అయింది. వంద శాతం వాటాల‌ను కొత్త‌గా ఏర్పాటు చేయ‌బోయే స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ (ఎస్పీవీ)కి బ‌దిలీ చే్య‌నున్నారు. అయితే ఈ ఎస్పీవీలో ప్ర‌ముఖ వాటా దేశంలోని ప్ర‌ముఖ మౌలిక‌స‌దుపాయాల సంస్థ‌గా ఎదిగిన మెఘా ఇంజ‌నీరింగ్ సంస్థ ఉంది. దీంతో పాటు రామేశ్వ‌ర‌రావుకు కూడా ఈ డీల్ లో వాటా ఉందని విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే ప్ర‌ధాన వాటాదారు మాత్ర‌మే మెఘానే అని చెబుతున్నారు. అయితే వంద శాతం వాటాల‌ను విక్ర‌యించ‌టంతో ప్ర‌స్తుతం సీఈవోగా ఉన్న ర‌విప్ర‌కాష్ సంస్థలో కొన‌సాగుతారా? బ‌య‌ట‌కు వ‌స్తారా? అన్న‌ది వేచిచూడాల్సిందే. స‌రిగ్గా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో ఈ నెంబ‌ర్ వ‌న్ ఛాన‌ల్ డీల్ జ‌ర‌గ‌టం విశేషం.

టీవీ9కు తెలుగుతో పాటు క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్ త‌దిత‌ర భాష‌ల్లో ఛాన‌ల్స్ ఉన్న విష‌యం తెలిసిందే. ప్రారంభం నుంచి టీవీ9 ఛాన‌ల్ తెలుగులో త‌న ఆదిప‌త్యాన్ని కొన‌సాగిస్తూనే వ‌స్తోంది. వార్త‌ల్లో కొత్త ఒర‌వ‌డికి కార‌ణ‌మైన ఛాన‌ళ్ళ‌లో టీవీ9 ఒక‌టి. అయితే ఈ మ‌ధ్య కాలంలో అదే స్థాయిలో వివాదాల‌ను ఎదుర్కొంది. ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న అనేక ఛాన‌ళ్ళు టీవీ9 ను అధిగ‌మించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసినా..స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాయి. మొత్తానికి శ్రీనిరాజు టీవీ9 నుంచి ఎగ్జిట్ అయి..ఊపిరిపీల్చుకున్నార‌ని మార్కెట్ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో 10టీవీ, టీవీ99 యాజ‌మాన్యాలు కూడా చేతులు మారిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీవీ9 యాజ‌మాన్యం కూడా మార‌నుండ‌టంతో తెలుగులో చేతులు మారుతున్న మూడ‌వ ఛాన‌ల్ ఇది.

Next Story
Share it