కేరళకు ‘ట్రూజెట్’ ఉచిత సేవలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ కష్టాల్లో ఉన్న కేరళకు తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. మూడు రోజుల పాటు ఉచితంగా వస్తువులను రవాణా చేయటంతోపాటు కేరళలోని వరదల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను ఉచితంగా చెన్నై, హైదరాబాద్ తీసుకు రావాలని నిర్ణయించింది. వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు పలు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి స్థానిక ప్రజలకు అత్యవసరమైన మందులు, దుస్తులు,ఆహారం మొదలైనవి సేకరిస్తున్నాయి. వాటిని కేరళకు త్వరగా చేర్చేందుకు ట్రూజెట్ సిద్ధమైంది.
మంగళ, బుధ, గురువారాల్లో హైదరాబాద్, చెన్నైల నుంచి వీటిని కేరళ రాజధాని త్రివేండ్రం ఉచితంగా చేరవేయాలని ట్రూజెట్ నిర్ణయించినట్లు ఆసంస్థ ముఖ్య కార్య నిర్వహణ అధికారి విశోక్ మాన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మూడు రోజుల్లో ఉదయం ఐదున్నరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెలంగాణ ప్రభుత్వం, స్థానిక స్వచ్ఛంద సంస్థలు సేకరించిన సామాగ్రితో బయలుదేరే ట్రూజెట్ విమానం చెన్నై చేరుకుంటుంది. తమిళనాడు ప్రభుత్వం సేకరించిన వస్తు సామాగ్రితో అక్కడి నుంచి త్రివేండ్రం వెళుతుంది. కేరళ ప్రభుత్వ అధికారులకు వాటిని అందిస్తుంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో వరదల్లో చిక్కుకుని అత్యవసరంగా చెన్నై, హైదరాబాద్ రావాల్సిన ప్రయాణికులను ఉచితంగా ఆయా ప్రాంతాలకు చేరవేస్తుంది.