Telugu Gateway
Telangana

పరిపూర్ణానంద నగర బహిష్కరణపై హైకోర్టు స్టే

పరిపూర్ణానంద నగర బహిష్కరణపై హైకోర్టు స్టే
X

నగర బహిష్కరణ ఎదుర్కొంటున్న స్వామి పరిపూర్ణానందకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై పోలీసులు విధించిన బహిష్కరణను నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనర్‌లు ఆయనపై ఆరునెలల పాటు విధించిన నగర బహిష్కరణను కోర్టు నిలిపివేసింది. తనపై విధించిన నగర బహిష్కరణను సవాల్‌ చేస్తూ పరిపూర్ణానంద స్వామి హైకోర్టును ఆశ్రయించారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ యాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించడంతో ఆయనను నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీస్‌ కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు జులై 10న పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో అడుగుపెట్టొద్దని, నోటీసులు అందుకున్న 24 గంటల్లో నగరాన్ని విడిచిపెట్టాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు పరిపూర్ణానంద నగర బహిష్కరణకు ముందే కత్తి మహేష్‌ను కూడా ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా బిజెపి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు పూరిపూర్ణానంద నగర బహిష్కరణను ఉపసంహరించుకోవాలని. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఏకంగా బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా ఈ అంశంపై లేఖ రాశారు.

Next Story
Share it