Telugu Gateway
Telangana

‘రైతు బీమా సాయం ప్రకటనలో పొలమే లేని వారి ఫోటోలు

‘రైతు బీమా సాయం ప్రకటనలో పొలమే లేని వారి ఫోటోలు
X

రైతు బీమా పథకం తెలంగాణ సర్కారుకు ఎంత మేలు చేసిందో తెలియదు కానీ..ఒక్క యాడ్ మాత్రం ప్రభుత్వాన్ని బాగా డ్యామేజ్ చేసింది. కోట్లాది రూపాయలు ప్రకటనలపై వెచ్చిస్తున్న తెలంగాణ సర్కారు వీటిపై కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా వ్యవహరించింది. రైతు బీమా పథకం కింద పేజీలకు పేజీలు యాడ్స్ ఇఛ్చారు. ఈ ప్రకటనల్లో లబ్దిదారులు ఆనందంగా ఉన్న ఫోటోలు వాడారు. అయితే ఈ ఫోటోలో ఉన్న కుటుంబానికి ఈ పథకం కింద అర్హత పొందేందుకు కనీసం ఎకరం పొలం కూడా లేదు. కానీ నవ్వుతూ తాము రైతు బీమా లబ్దిదారులం అని చెబుతున్నట్లు యాడ్స్ మాత్రం పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. రైతుబీమా పథకం కింద చాలా మందికి ప్రయోజనకరమే. అందులో ఎలాంటి వివాదం లేదు. కానీ సీఎం కెసీఆర్ తో పాటు లబ్దిదారుల ఫోటోలతో కూడిన యాడ్స్ విషయంలో సర్కారు శాఖలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయనటానికి ఇదే నిదర్శనం. అంతే కాదు..ఒకటే మహిళ ఫోటోను ఓ వైపు రైతు బీమా, మరో వైపు కంటి వెలుగుకు వాడేశారు. అక్కడ కూడా ఘోర తప్పిదమే. ఏకంగా ఫోటోలో ఉన్న మహిళ పక్కన అసలు భర్త కాకుండా..వేరే వాళ్ల ఫోటోను జతచేశారు. దీంతో ఇఫ్పుడు ఆ కుటుంబం సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

కనీసం తమ అనుమతి లేకుండా ఫోటోలు వాడటం ఒకెత్తు అయితే...తన భర్త స్థానంలో మరొకరి ఫోటో పెట్టి అవమానించారని ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ యాడ్ కారణంగా తమ కుటుంబం పరువు పోయిందని..బంధులు అందరూ తమపై విమర్శలు చేస్తున్నారంటూ నాయకుల నాగరాజు, ఆయన భార్య పద్మలు మీడియా ముందుకొచ్చారు. వాస్తవానికి ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎప్పుడో వెలుగులోకి తెచ్చినా..సమాచార శాఖ మాత్రం ఆ కుటుంబం మీడియా ముందుకు వచ్చి సర్కారు తీరును తప్పు పట్టిన తర్వాత యాడ్ ఏజెన్సీలకు నోటీసులు ఇచ్చామని చెబుతూ హడావుడిగా ప్రకటన జారీ చేయటం విశేషం.

Next Story
Share it