Telugu Gateway
Politics

కాంగ్రెస్ కు ‘రిలయన్స్ లీగల్ నోటీసులు’

కాంగ్రెస్ కు ‘రిలయన్స్ లీగల్ నోటీసులు’
X

రాఫెల్ డీల్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ డీల్ లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే...రిలయన్స్ డిఫెన్స్ కు చెందిన అనిల్ అంబానీ మాత్రం అదంతా తప్పుడు ప్రచారం అని..కాంగ్రెస్ వాదనలో నిజం లేదని చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు రాఫెల్ డీల్ పై దేశ వ్యాప్తంగా ప్రచారానికి సిద్ధం అవుతున్న అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నేతలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని లేకుంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌, రిలయన్స్‌ డిఫెన్స్‌, రిలయన్స్‌ ఏరోస్ర్టక్చర్‌లు నోటీసులు పంపాయి. రాజకీయ నాయకులకు భావప్రకటనా స్వేచ్ఛ అంటే తమ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం మాట్లాడేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్టు కాదని కాంగ్రెస్‌ ప్రతినిధి జైవీర్‌ సెర్గిల్‌ను ఉద్దేశించి రిలయన్స్‌ తన నోటీసులో స్పష్టం చేసింది. మీ రాజకీయ ప్రయోజనాల కోసం అవాస్తవ, తప్పుడు ప్రకటనలను చేయడం భావప్రకటనా స్వేచ్ఛ కాబోదని పేర్కొంది. రాఫెల్‌ ఒప్పందంపై సంయమనంతో వ్యవహరించాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ ఏరోస్ర్టక్చర్‌, రిలయన్స్‌ డిఫెన్స్‌ లు ఈ నోటీసులో జైవీర్‌ సెర్గిల్‌ను హెచ్చరించాయి.

రిలయన్స్‌ కు వ్యతిరేకంగా రణదీప్‌ సుర్జీవాల్‌, అశోక్‌ చవాన్‌, సంజయ్‌ నిరుపమ్‌, అనురాగ్‌ నారాయణ్‌ సింగ్‌, ఊమెన్‌ చాందీ, శక్తి సంహ్‌ గోయల్‌,గొహిల్‌, సునీల్‌ కుమార్‌ జకర్‌. అభిషేక్‌ మను సింఘ్వీ, సునీల్‌ కుమార్‌ జాఖర్‌, ప్రియాంక చతుర్వేది వంటి కాంగ్రెస్‌ నేతలు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారని రిలయన్స్‌ పేర్కొంది. పార్లమెంట్ లోపల...వెలుపలా రాఫెల్ డీల్ తోపాటు నేరుగా అనిల్ అంబానీకి చెందిన కంపెనీపై కూడా రాహుల్ విమర్శలు చేశారు. ప్రధాని మోడీ ఇదంతా అప్పుల్లో కూరుకుపోయిన తన స్నేహితుడు అనిల్ అంబానీకి మేలు చేసేందుకే చేశారని ఆరోపించారు. అయినా రిలయన్స్ కంపెనీలు మాత్రం ఈ నోటీసుల విషయం రాహుల్ కు మినహాయింపు ఇవ్వటం విశేషం.

Next Story
Share it