Telugu Gateway
Andhra Pradesh

ప్రధానిని డిసైడ్ చేసే పార్టీ...పొత్తు కోసం వెంపర్లాటా!

ప్రధానిని డిసైడ్ చేసే పార్టీ...పొత్తు కోసం వెంపర్లాటా!
X

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసిన ‘పెళ్లిళ్ల’ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారం రేపాయి. చంద్రబాబునాయుడు కొత్తగా కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అవుతున్నాడన్న విషయాన్ని జగన్ ఆరవ పెళ్లికి చంద్రబాబు రెడీ అంటూ చెప్పటం..అది కాస్తా ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఉండటంతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడినట్లు అయింది. టీడీపీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓ వైపు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూనే..మరో వైపు ఖచ్చితంగా తమకు కాంగ్రెస్ తో పొత్తు ఉండదనే విషయాన్ని మాత్రం దాటవేశారు. తమకు ఎవరి పంచన చేరాల్సిన అవసరరం లేదని ప్రకటించారు తప్ప... వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని మాత్రం చెప్పలేకపోయారు. మంగళవారం నాడు చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో తెలంగాణలో పొత్తులు ఉంటాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు పత్రికల్లో వార్తలు కూడా వెలువడ్డాయి. ఓ వైపు వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో తామే ప్రధానిని డిసైడ్ చేస్తామని యనమల వంటి టీడీపీ నేతలు చెబుతున్నారు. 25 ఎంపీ సీట్లు ఉన్న టీడీపీ కేంద్రంలో ప్రధాని ఎవరుండాలో డిసైడ్ చేసే పరిస్థితి ఉంటుందా?. అయినా అందులో టీడీపీకి వచ్చేవి ఎన్నో ఎన్నికలు పూర్తయితే కానీ తెలదు. ఏమీ తేలకముందే ప్రధానిని డిసైడ్ చేస్తాం అంటే నమ్మెదెవరు?

అసలు వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుపుపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో యనమల వ్యాఖ్యలు టీడీపీ పరిస్థితిని చెప్పకనే చెబుతున్నయి. ఏపీలో ఒంటరి అయిన టీడీపీకి పొత్తు పెట్టుకోవటానికి కాంగ్రెస్ తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి. వైసీపీ ఒంటరి పోరే అని తేలిపోయింది. జనసేన, సీపీఐ, సీఫీఎంలు కలసి సాగనున్నారు. ఇక చంద్రబాబుకు మిగిలింది కాంగ్రెస్ తప్ప ఏమీ లేదు. బిజెపి ఒంటరిగానే ముందుకు సాగనుంది. తెలంగాణలోనూ టీఆర్ఎస్ తాము ఒంటరిగానే వెళతామని ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంత మంది మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు.

కాంగ్రెస్ తో పొత్తు వల్ల పరిస్థితి ఎటువైపు వెళుతుందో అన్న ఆందోళన తెలంగాణ నేతల కంటే ఏపీ టీడీపీ నేతల్లోనే ఎక్కువ ఉంది. తెలంగాణలో టీడీపీ పొత్తుతో కొన్ని సీట్లు సాధించుకుంటే గొప్ప అన్న చందంగా ఉంది. కానీ ఏపీ లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నం. అధికారాన్ని కాపాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ రూపంలో పోయిన ఓటు బ్యాంకు..బిజెపితో గత ఎన్నికల సమయంలో కలిసొచ్చిన సానుకూలాంశాలు లేకపోవటం, ప్రభుత్వంపై వ్యతిరేకత..విపరీతంగా పెరిగిపోయిన అవినీతి..ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అందుకే జగన్ చేసిన కొత్త పెళ్లి వ్యాఖ్యలు టీడీపీని ఇరకాటంలోకి నెట్టాయి. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతతో అయినందున ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే నష్టమే ఎక్కువ ఉంటుందన్న భయం సీనియర్ నేతల్లోనూ ఉంది.

Next Story
Share it