Telugu Gateway
Andhra Pradesh

లోకేష్‌....మీ నాన్న‌ను ఆద‌ర్శంగా తీసుకోవ‌ద్దు

లోకేష్‌....మీ నాన్న‌ను ఆద‌ర్శంగా తీసుకోవ‌ద్దు
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా మ‌రోసారి మంత్రి నారా లోకేష్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వెన్నుపోట్ల‌తో ముఖ్య‌మంత్రి కావాల‌ని అనుకోవ‌ద్ద‌ని వ్యాఖ్యానించారు. మీ నాన్న‌ను కాదు...మ‌హాత్ముల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచించారు. 40 కోట్ల రూపాయ‌లు గుమ్మరించి నియోజ‌క‌వ‌ర్గాల‌ను స్వాధీనం చేసుకుంటామంటే కుద‌ర‌ద‌ని తేల్చిచెప్పారు. లోకేష్ ముఖ్య‌మంత్రి కావొచ్చ‌ని..అయితే అది వెన్నుపోటు పొడిచి కాద‌న్నారు. ఎన్టీఆర్ ఎన్నో క‌ష్టాల‌కు ఓర్చి ఆ స్థాయికి వ‌చ్చార‌న్నారు. లోకేష్ త‌న తండ్రిని ఆద‌ర్శంగా తీసుకుని వెన్నుపోటు పొడ‌వాల‌ని చూడ‌కూడ‌ద‌న్నారు. నిడ‌ద‌వోలు బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్శిటీలో చ‌దువుకున్న లోకేష్ అక్క‌డే చ‌దివిన అమెరికా 35వ ప్రెసిడెంట్ కెన‌డీ మాట‌ల‌ను లోకేష్ గుర్తుపెట్టుకోవాలన్నారు. దేశం నాకేమి ఇచ్చింది అని కాదు..నేను దేశానికి ఏమి ఇచ్చాను అని ఆలోచించుకోవాలి. లోకేష్ మాత్రం దేశం నుంచి ఎంత జుర్రుకుందామా? అని చూస్తున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించటంలో ముఖ్య‌మంత్రి మొద‌లుకుని టీడీపీ ఎంపీలు.ఎమ్మెల్యేలు విఫ‌ల‌మయ్యార‌ని అన్నారు.

లోకేష్ త‌మ కుటుంబానికి వెన్నుపోటు రాజ‌కీయాలు చేయ‌టం అల‌వాటు అనుకుంటే కుద‌ర‌ద‌ని అన్నారు. ఎదురుగా కౌగిలించుకుని వెన‌క నుంచి పొడుస్తామంటే ప‌డేవాళ్లు ఎవ‌రూ లేర‌న్నారు.ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి మాట్లాడ‌మంటే జ‌గ‌న్ నా వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడ‌తారు. త‌న జీవితంలో ర‌హ‌స్యాలు ఏమీ లేవ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. లోకేష్ కూడా త‌న‌ని తిట్టిస్తున్నార‌ని..త‌న త‌ల్లిని అన‌కూడ‌ని మాట‌లు అన్పించార‌ని అన్నారు. లోకేష్ ఓ సారి మీ అమ్మ‌ని అడిగి చూడు...అది త‌ప్పో..ఒప్పో చెబుతారు అని పేర్కొన్నారు. జ‌న‌సేన గుర్తు పిడికిలి అని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అంద‌రి ఐక్య‌త‌కు చిహ్నంగా పిడికిలి ఉంటుంద‌ని అన్నారు.

Next Story
Share it