ఓడినా...చరిత్ర సృష్టించిన సింధు

మళ్ళీ అదే రిపీట్. పీ వీ సింధు ఫైనల్ లో పరాజయం పాలైంది. అత్యంత కీలకమైన ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ లోనూ పాత కథే పునరావృతమైంది. ఫైనల్ వరకూ వచ్చిన సింధు అక్కడ మాత్రం పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అయినా సరే..సింధు కొత్త చరిత్ర లిఖించింది. ఏషియన్ గేమ్స్ సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు గుర్తింపు సాధించింది. ఈ ఆసియా క్రీడల ముందు వరకూ మహిళల, పురుషుల సింగిల్స్ లో ఫైనల్‌కు చేరిన వారు కూడా లేరు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తుది పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 13-21, 16-21 తేడాతో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన పోరులో సింధు పూర్తిస్థాయి ఆటను కనబరచడంలో విఫలమైంది.
ఫలితంగా సింధు రజతంతోనే సంతృప్తి పడాల్సి వచ్చింది. వరుస రెండు గేమ్‌లను తై జు యింగ్‌కు సునాయాసంగా కోల్పోయిన సింధు.. మరొకసారి ఫైనల్ లె తడబడింది. తద్వారా 2016 రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో చివరిసారి తై జు యింగ్‌ని ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో ఆడిన వరుస ఆరు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైనట్లు అయింది. ఆసియా క్రీడా బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ ఇప్పటివరకూ ఒకే ఒక్క సింగిల్స్ పతకం ఉంది. తాజా ఏషియన్ గేమ్స్ లో సింధు కనీసం రజత పతకం దక్కించుకోగా, సైనా నెహ్వల్ కాంస్యాన్ని సాధించింది.