Telugu Gateway
Andhra Pradesh

లోకేష్...కుటుంబరావు ఒకటే లైన్!

లోకేష్...కుటుంబరావు ఒకటే లైన్!
X

ఏపీ ఐటి, పంచాయతీరాజ్ ల శాఖ మంత్రి నారా లోకేష్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఇద్దరూ ఒకటే లైన్ లో ఉన్నారు. విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ మాకు 25 ఎకరాలు కేటాయించండి అని అడిగితే నలభై ఎకరాలు ఇచ్చేసింది చంద్రబాబు సర్కారు. ఇందులో స్కామ్ ఉందండీ బాబూ అంటే...మీకు చేతనైతే మీరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీని తీసుకురండి..వాళ్లకు కూడా అంతే భూమి...అంతే రాయితీలు ఇస్తామంటారు నారా లోకేష్. ఐటి మంత్రిగా నారా లోకేష్ ఉండాలి..కంపెనీలను ఏమో ప్రభుత్వం బయట ఉండే జనసేన, వైసీపీ నాయకులు తేవాలా?. అప్పుడు క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుంటారా?. ప్రభుత్వ పాలసీకి భిన్నంగా...ఫ్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పిన వాటికి విరుద్ధంగా పనిచేస్తున్నారని ఎవరైనా విమర్శిస్తే...దానికి సమాధానం చెప్పాల్సింది పోయి...మీరు తెండి..మీకూ అన్నే రాయితీలు ఇస్తామని ప్రకటిస్తారు. ఇప్పుడు ప్రణాళికా ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా అదే లైన్ లోకి వచ్చారు.

అమరావతి బాండ్లపై అధిక వడ్డీ అని విమర్శలు చూసి తట్టుకోలేక బయటకు వచ్చి..ఇంత కంటే తక్కువ వడ్డీకి ఎవరైనా రుణం ఇప్పిస్తారా? తీసుకుంటారం రండి అంటూ ప్రకటించారు. ముందు మీరు మీ ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ వద్దకు పోయి మాట్లాడుకోండి. అమరావతి బాండ్ల పై వడ్డీ రేటు చాలా ఎక్కువని..సర్కారుకు కావాల్సిన రెండు వేల కోట్ల రూపాయలను తాము సర్దుబాటు చేస్తామన్నా కూడా కాదు..కూడదు అంటూ అత్యధిక వడ్డీ రేటుకు బాండ్లు జారీ చేసి..ప్రజలపై భారం మోపుతున్నది చంద్రబాబు సర్కారు. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపటం ప్రతిపక్షాలు..లేదా పత్రికల బాధ్యత. మాకు తక్కువ వడ్డీరేటుకు రుణాలు తెచ్చుకోవటం చేతకాదు..అధిక వడ్డీకే తెచ్చి..ప్రజలపై భారం మోపుతాం అని కుటుంబరావు చెప్పదలచుకున్నారా?. లేక మా సర్కారు ఇంతే పాలిస్తుందని స్పష్టం చేయదలచుకున్నారా?. మాకు నచ్చినట్లు చేసుకుంటాం...మీరేమి మాట్లాడవద్దు అనటం ఓ రకంగా నియంతృత్వమే అవుతుంది.

Next Story
Share it