Telugu Gateway
Andhra Pradesh

నారా లోకేష్ మరో ‘బోగస్ హామీ’

నారా లోకేష్ మరో ‘బోగస్ హామీ’
X

ఎన్నికల సీజన్ వస్తోంది. మళ్ళీ మాయ..బోగస్ హామీలు ముందుకొస్తున్నాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా మరో ప్రకటించిన హామీ అచ్చం అలాంటిదే. అదేంటి అంటే 2024 నాటికి ఏపీని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మార్చేస్తారంట. ఆయనే స్వయంగా విశాఖపట్నంలో ఈ విషయం చెప్పారు. ఏపీలో ప్రస్తుతం సర్కారు నిరుద్యోగ భృతి అందివ్వాలని నిర్ణయించిన వారి సంఖ్యే పది లక్షలు. అంటే లోకేష్ టార్గెట్ గా పెట్టుకున్న 2024 అంటే మరో ఆరేళ్ళ సమయం ఉంది. ఈ మధ్యలో ఎంతో మంది యువత డిగ్రీలు..పీజీలు పూర్తి చేసుకుని కాలేజీల నుంచి బయటకు వచ్చేస్తారు. మరి వీళ్లందరికీ మంత్రి నారా లేకేష్ ఉద్యోగావకాశాలు కల్పించగలరా?. భాగస్వామ్య సదస్సులు...ఒప్పందాలు చేసుకుంటూ...పెద్ద సంఖ్యలో ‘లెక్కలు’ అయితే చూపిస్తున్నారు కానీ..క్షేత్ర స్థాయిలో అమలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. సర్కారు చెప్పే లెక్కలకు...వాస్తవ పరిస్థితికి మధ్య తేడా భారీగా ఉంటుంది. చంద్రబాబు నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు అన్నీ అమలు జరిగితే కూడా వచ్చే ఉద్యోగాలు కూడా 40 లక్షలుపైనే. కానీ అందులో అమలు శాతం కేవలం 30 శాతం వరకే ఉంది. ఇప్పటికే ఏపీలో నిరుద్యోగుల సంఖ్య కోటిన్నరపైనే. మరో ఆరేళ్ళలో ఈ సంఖ్య మరింత పెరగటం ఖాయం.

ఏ రాష్ట్రంలో అయినా అసలు నిరుద్యోగులే లేకుండా ఉద్యోగావకాశాలు కల్పించటం అనేది జరిగే పని కాదు. అది దేశంలో నేనే సీనియర్ అని క్లైయిం చేసుకునే చంద్రబాబు వల్ల కూడా కాదు. అలాంటిది నారా లోకేష్ ఎంతో ఈజీగా ఏపీని నిరుద్యోగరహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించటం విశేషం. ప్రజలను...ముఖ్యంగా నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేయటానికే ఇలాంటి ‘మాయ హామీలు’ అని చెప్పుకోవచ్చు. గత ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు రెండు వేల రూపాయల లెక్కన భృతి ఇస్తామని హామీ ఇచ్చి..నాలుగేళ్లకుపైగా నాన్చి..ఇప్పుడు ఆ నిరుద్యోగ భృతిని వెయ్యి రూపాయలకు తగ్గించారు. అందులోనూ నిరుద్యోగుల సంఖ్య కోట్లలో ఉంటే అర్హులు పది లక్షల మంది మాత్రమే ఉంటారని తేల్చారు.

Next Story
Share it