Telugu Gateway
Andhra Pradesh

రాహుల్ సమావేశానికి నారా బ్రాహ్మణీ

రాహుల్ సమావేశానికి నారా బ్రాహ్మణీ
X

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీ నగరంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగింది. ఈ సమావేశానికి ఏపీ మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణీ హాజరుకావటం ఆసక్తికరంగా మారింది. ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ కు దగ్గర అవుతున్న తరుణంలో రాహుల్ గాంధీ పాల్గొనే సమావేశానికి బ్రాహ్మణీ హాజరుకావటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరైనప్పుడు జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశానికి కూడా బ్రాహ్మణీ హాజరయ్యారు. పారిశ్రామికవేత్తగా నారా బ్రాహ్మణీ చాలా చురుగ్గా ఉంటారనే పేరుంది. అయితే ప్రస్తుతం శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాహుల్ హైదరాబాద్ లో పారిశ్రామివేత్తలతో సమావేశం కావటం...అందుకు నారా బ్రాహ్మణీ హాజరు కావటం అనేది భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతంగా పరిగణిస్తున్నారు.

ఇవాంకా కార్యక్రమానికి..రాహుల్ గాంధీ కార్యక్రమానికి అసలు ఏ మాత్రం పోలిక కూడా లేదు. అయితే భవిష్యత్ లో నారా బ్రాహ్మణీ రాజకీయాల్లోకి వస్తారని టీడీపీ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఎవరైనా ఈ అంశాన్ని బ్రాహ్మణీతో ప్రస్తావించినా ప్రస్తుతం తన ఫోకస్ అంతా వ్యాపారంపైనే అని చెబుతుంటారు. అటు ఇవాంకా అయినా...ఇటు రాహుల్ గాంధీ టూర్ అయినా పరిస్థితులను అధ్యయనం చేసేందుకే బ్రాహ్మణీ ఇలాంటి కార్యక్రమాలకు హాజరు అవుతుంటారని చెబుతున్నారు. పూర్తిగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె అగ్రనేతలను వ్యవహారశైలిని తెలుసుకునేందుకు ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. బ్రాహ్మణీతో పాటు ఈ సమావేశానికి టీడీపీ ఎంపీ టీ జీ వెంకటేష్ తనయుడు భరత్ కూడా హాజరు అయ్యారు.

Next Story
Share it