Telugu Gateway
Telangana

మోడీ...కెసీఆర్ సేమ్ టూ సేమ్

మోడీ...కెసీఆర్ సేమ్ టూ సేమ్
X

కేంద్రంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఎలా ప‌నిచేస్తున్నారో..తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కెసీఆర్ కూడా అచ్చం అలాగే ప‌నిచేస్తున్నార‌ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రెండు రో జుల తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన రాహుల్ ప‌లు స‌మావేశాల్లో పాల్గొన్నారు. ‘ప్రతి ఒక్కరి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ అంటారు.. ప్రతి కుటుంబానికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తానని కేసీఆర్‌ చెబుతారు. రాఫెల్‌ కాంట్రాక్ట్‌ కోసం ప్రధానితో పాటు అనిల్‌ అంబానీ ఫ్రాన్స్‌ వెళ్లారు. ఎలాంటి అనుభవంలేని అనిల్‌ అంబానీకి కాంట్రాక్టు ఇస్తారు. ఎంతో అనుభవం ఉన్న హెచ్‌ఏల్‌కు మాత్రం కాంట్రాక్టు ఇవ్వరు. ఇంత చేస్తే అనిల్‌ అంబానీ కంపెనీకి ఉన్న అనుభవం కేవలం 10 రోజులు మాత్రమే. తెలంగాణలో రైతుల నుంచి భూములను లాక్కుంటున్నారని, అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌ సర్కార్‌లు ఒకేలా ఉన్నాయన్నారు. ఇద్దరు హామీలను పూర్తిగా మరిచిపోయారని మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబపాలన సాగుతుందని రాహుల్‌ గాంధీ కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. జీఎస్టీ అంటే గబ్బర్‌ సింగ్‌ టాక్స్‌ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగానే సులభతరమైన టాక్స్‌ విధానం కోసం జీఎస్టీ తీసుకొచ్చిందని అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకించారన్నారు. మహిళా అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ది చెందదని కాంగ్రెస్‌ నమ్ముతుందని, మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలు మహిళా భాగస్వామ్యాన్ని మరిచిపోయాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని మోదీ అన్నారని, ఆరోగ్యం, విద్య పేదలకు అందడం లేదని, యూనివర్సిటీలను ప్రయివేట్‌ పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తమ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. భేటీ బచావో, భేటీ పడావో అని మోదీ అన్నారని, యూపీలో ఎమ్మెల్యే అత్యాచారం చేసినా.. బీహార్‌లో పిల్లల మీద అత్యాచారం జరిగినా, దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగినా ఆయన నోట మాట రావడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, వచ్చేది మహిళా సంఘాల సర్కార్‌ అని రాహుల్‌ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే మహిళల రుణాల మీద వడ్డీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చందమామను భూమి మీద తీసుకొస్తానని చెప్పను. కానీ మోదీ, కేసీఆర్‌ అదే విషయాన్ని చెబుతున్నారు. ప్రతి అకౌంట్లో రూ 15 లక్షలు వేస్తానని తానేప్పుడు చెప్పను. కానీ మోదీ అదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ నెరవేరుస్తాం. అది ఏపీ, తెలంగాణల హక్కు. అర్ధరాత్రి 12 గంటలకు గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ పెట్టారు. రైతలు రుణమాఫీ అడుగుతుంటే మోదీ నో అంటున్నారు. సూటు, బూటు మాఫీ చేస్తామంటున్నారు.’ అని రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Next Story
Share it