టీడీపీలోకి కొండ్రు మురళీ..31న చేరిక
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాల్లో మళ్లీ కొత్త జంపింగ్ లు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళీ అధికార టీడీపీలో చేరేందుకు రెడీ పోయారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఆదివారం నాడు ప్రకటించారు. ఈ నెల 31న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాధ కలిగించిందన్నారు. కష్టకాలంలో తనతో ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే కొండ్రును పార్టీలోకి చేర్చుకోవటాన్ని టీడీపీ సీనియర్ నాయకురాలు,మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే చంద్రబాబు మాత్రం కొండ్రు మురళీ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కొండ్రు మురళీ కాంగ్రెస్ లో ఉండగా..చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలా చేసిన వారంతా ఇప్పుడు టీడీపీలోకి క్యూ కడుతున్నారు. ఆ జాబితాలో ఉన్న టీ జీ వెంకటేష్, డొక్కా మాణిక్యవరప్రసాద్ వంటి వారికి ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు కూడా దక్కాయి. ఇప్పుడు కొండ్రు మురళీ వంతు వచ్చింది.