Telugu Gateway
Telangana

‘ముందస్తు’ ఎన్నికల గంట మోగించిన కెసీఆర్

‘ముందస్తు’ ఎన్నికల గంట మోగించిన కెసీఆర్
X

తెలంగాణలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ లోనే ఈ ఎన్నికలు ఉండే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇఛ్చారు. సోమవారం నాడు నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తమ ప్లాన్స్ ఏంటో చెప్పేశారు. వచ్చే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధుల జాబితాను సెప్టెంబర్ లోనే ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఉంటాయి. మరి సెప్టెంబర్ లో అభ్యర్ధుల ప్రకటన అంటే..డిసెంబర్ లో ఎన్నికలు ఉంటేనే కదా?. అన్న సందేహం సహజం. అదే నిజం. అంతే కాదు..సెప్టెంబర్ 2న నగర శివార్లలో భారీ ఎత్తున ‘ప్రగతి నివేదన’ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ రద్దు వచ్చే నెలలో ఉండే అవకాశం ఉంది. ఈ లోగానే ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలు అన్నింటిని పట్టాలెక్కించి..ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పాత పథకాల కిందే ఎలాంటి బ్రేక్ లు లేకుండా అవి అమలు అయ్యేలా రంగం సిద్ధం చేస్తున్నారు.

అయితే ఎక్కువ శాతం పాత వారికే టిక్కెట్లు ఉంటాయని..కొంత మందిని మాత్రం తప్పిస్తానని కెసీఆర్ స్పష్టం చేశారు. మరి ఆ వేటు పడేవారు ఎవరు? అన్నది వచ్చే నెలలో తేలనుంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఓకేసారి వెళ్లే కంటే..అసెంబ్లీకి విడిగా వెళితనే ఉపయోగం ఉంటుందని కెసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తాజా ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీతో ఈ అంశంపై చర్చించి..సహకరించాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు. మోడీ నుంచి కూడా సానుకూలత వ్యక్తం కావటంతో కెసీఆర్ రంగంలోకి ముందస్తు కసరత్తు ప్రారంభించారని...తెలంగాణకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ తోపాటు ఎన్నికలు జరగటం ఖాయంగా కన్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి తామే అధికారంలోకి వస్తామని కెసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it