Telugu Gateway
Telangana

కెసీఆర్ ముహుర్త బలం కోసమే ‘ముందస్తు’ ఎన్నికలా?

కెసీఆర్ ముహుర్త బలం కోసమే ‘ముందస్తు’ ఎన్నికలా?
X

‘డిసెంబర్ 2018లోపు ఎన్నికలు జరిగితే మీకు అంతా మంచే జరుగుతుంది. తిరిగి మీరే మళ్ళీ అధికారంలోకి వస్తారు.’ ఇదీ ఓ జోతిష్య పండితుడు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు ఇచ్చిన సలహా?. అందుకే ఇప్పుడు కెసీఆర్ ముందస్తు ఎన్నికలకు అంత హడావుడి చేస్తున్నారా?. ఇది ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ఎంతో మంది ముఖ్యమంత్రులు తమ పాలన నిర్వహించిన ప్రస్తుత సచివాలయం వాస్తు ప్రకారం లేదని గత నాలుగున్నర సంవత్సరాలుగా అటువైపు కూడా చూడని కెసీఆర్ కు ఇలాంటి నమ్మకాలు ఉంటాయనటంలో ఎలాంటి విచిత్రం.. వింతా లేదు కూడా?. ప్రస్తుతం కెసీఆర్ ముందస్తు ఎన్నికలకు హడావుడి చేయటం వెనక ఇంతకు మించిన బలమైన కారణం కూడా ఏదీ లేదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ అస్థిరత ఏమీ లేదు. పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చేసుకుని పార్టీని ఎంతో ‘బలోపేతం’ చేసుకున్నారు. టీఆర్ఎస్ లో ప్రస్తుతానికి అసలు అసమ్మతి అన్న మాటే లేదు. పోనీ ప్రతిపక్షాలు అన్నీ ఏకమై కెసీఆర్ ప్రభుత్వ విధానాలపై ఏమైనా పోరాటాలు చేస్తున్నాయా? అంటే అదీ లేదు. మీడియా అంతా కెసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ..ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందా? అంటే అది కలలో కూడా ఊహించని మాట.

ఓ వైపు కంటి వెలుగు, మరో వైపు రైతు బంధు, రైతు భీమా, తెలంగాణ ప్రజల కల అని చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరుగులు...ఇలా చెప్పుకోవటానికి ఎన్నో ఉన్నా..కెసీఆర్ లో ఏదో తెలియని భయం. కేవలం కెసీఆర్ తన ముహుర్త నమ్మకాల ఆధారంగానే ముందస్తు ఎన్నికల విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తున్నారని..అంతకు మించిన బలమైన కారణాలు ఒక్కటంటే ఒక్కటి ఎవరైనా చెప్పగలరా? అని ఓ నాయకుడు ప్రశ్నించారు. సహజంగా ప్రతిపక్షం చాతనైతే ఎన్నికలు పెట్టండి మా సత్తా ఏంటో చూపిస్తాం అని సవాళ్లు విసురుతున్నాయి.

పొరుగునే ఉన్న ఏపీలో వైసీపీ ఇలాంటి సవాళ్ళే విసురుతుంటుంది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కూడా లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం రెడీ..కెసీఆర్ ఇంటికి పోవటం ఖాయం అంటూ మాట్లాడటం తప్ప..సవాళ్ళు చేసే స్థితిలో కూడా ఆ పార్టీ లేదు. అలాంటిది ఎలాంటి పాలనాపరమైన..రాజకీయపరమైన కారణాలు లేకుండా ఎందుకు కెసీఆర్ ముందస్తు కోరుకుంటున్నారు?. అంటే ఖచ్చితంగా ‘ముహుర్త’ బలమే అనే వాదన పార్టీ వర్గాల్లో బలంగా విన్పిస్తోంది. మరి కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ నాయకుల ‘ముహుర్తాల’ ప్రకారం ఎన్నికలు నిర్వహించటానికి ముందుకు వస్తుందా?. తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it