Telugu Gateway
Andhra Pradesh

ఒకే జాబితాలో జగన్...చంద్రబాబు...లోకేష్!

ఒకే  జాబితాలో జగన్...చంద్రబాబు...లోకేష్!
X

జగన్ అవినీతి లక్ష కోట్లు. ఇదీ టీడీపీ ఆరోపణ. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ల అవినీతి లక్షన్నర కోట్లు. ఇది, వైసీపీ, పవన్ ల మాట. అంటే అధికార, విపక్షాలు కలిపి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి మొత్తం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. వీరంతా ఒకరి దోపిడీని ఒకరు బయటపెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు పవన్. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని..వందల కోట్ల రూపాయల ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తనకు తినటానికి తిండి ఉంటే చాలని.. ప్రజాధనం దోపిడీ చేయనని అన్నారు. వైసీపీ, టీడీపీలు పరస్పరం చేసుకుంటున్న అవినీతి ఆరోపణలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తనకు అనుకూలంగా వాడేసుకుంటున్నారు. పవన్ తాజాగా చేసిన విమర్శలు పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అయితే జగన్ తో పాటు పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణల విషయంలో చంద్రబాబు, లోకేష్ ను ఒకేగాటన కట్టడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

జగన్ ఒక్కడే అవినీతిపరుడు, తామంతా నిజాయతీపరులం అన్న ధోరణితో ఇంత కాలం టీడీపీ అధిష్టానం కలరింగ్ ఇచ్చింది. ఇప్పుడు గతంలో ఎన్నడూలేని రీతిలో చంద్రబాబు, నారా లోకేష్ లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో కుంభకోణాలు, రాజధాని కేంద్రంగా అడ్డగోలుగా సాగే దందాలు..ఇసుక దోపిడీ, మైనింగ్ అక్రమాలు, విద్యా శాఖ, ఐటి కంపెనీలకు భూ కేటాయింపులు, విద్యుత్, మునిసిపల్ శాఖలో అవినీతి, భూ కబ్జాలు ఇలా ఒకటేమిటి చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కోని ఆరోపణ లేదు. తమకు కమీషన్లు రావనే ఉద్దేశంతో ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు దక్కిన టెండర్లను కూడా రద్దు చేసిన చరిత్ర చంద్రబాబుకు దక్కింది ఈ సారి. ఏపీలో కోటి రూపాయలు దాటిన ఏ చిన్న ప్రాజెక్టు అయినా సరే ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ముందుకు సాగటం లేదు. చివరకు ఉద్యోగాల పేరు చెప్పి కూడా స్కామ్ లకు పాల్పడుతున్నారు. ఇలా ప్రతి రోజూ ఏపీ సర్కారుకు సంబంధించిన ఏదో ఒక స్కామ్ వెలుగులోకి వస్తూనే ఉంది. అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు తాము ‘నిప్పు’ అని చెప్పుకునే పనిలో ఉంటారు.

అయితే అటు వైసీపీ, ఇటు ప్రభుత్వంలోని కీలక నేతలుగా ఉన్న చంద్రబాబు, నారా లోకేష్ లను తీవ్రమైన అవినీతిపరులుగా చిత్రీకరించటం ద్వారా ఎన్నికల్లో లబ్దిపొందాలనే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే చంద్రబాబునాయుడు నాలుగేళ్ల పాటు బిజెపితో అయితే ఎలా కలసి ఉండి...అంతా అద్బుతంగా ఉందని చెప్పి..నో...నో కేంద్రం ఇప్పుడు మాకేమీ చేయటంలేదన్న చందంగానే..పవన్ కళ్యాణ్ కూడా చివరి ఏడాదిలో టీడీపీ మొత్తం అవినీతి మయం అయిందని ఆరోపించటాన్ని ప్రజలు నమ్ముతారా?. పవన్ టీడీపీతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నానే చంద్రబాబు, లోకేష్ లు ఈ లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి చేయలేదు కదా?. మరి అంతకు ముందు అడ్డగోలుగా చంద్రబాబును సమర్థించిన పవన్ కళ్యాణ్ మద్దతు ఉన్న సమయంలో కూడా ఇది సాగింది. మరి దీనికి జనసేనాని ఏమి చెబుతారో?. జనసేన మద్దతు ఇఛ్చిన టీడీపీ అవినీతి పాపంలో పవన్ కళ్యాణ్ పాత్రేమీ లేదా?.

Next Story
Share it