‘టీడీపీ’లో హ్యుమన్ టచ్ ఔట్..‘క్యాష్ టచ్’ ఇన్!
ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబునాయుడు ఓ మాట చెప్పేవారు. పార్టీలో ‘హ్యుమన్ టచ్’ ఉండాలనేవారు. అప్పుడే నాయకులు..కార్యకర్తల మధ్య బంధం బలంగా ఉంటుందని హితబోధ చేసేవారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నాయకుల అందరి అభిప్రాయాలు వినేవారు. నిర్ణయం ఏదైననా అభిప్రాయాలు మాత్రం అడిగేవారు. వాళ్ళు చెప్పేవి వినేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయింది. టీడీపీలో ఇప్పుడు చంద్రబాబు ఓ ‘భాషా’లాగా మారిపోయారు. బాషా ఒక్కసారి చెపితే వందసార్లు చెప్పినట్లే అంటూ మరొకరి మాటను...అభిప్రాయాన్ని వినే పరిస్థితి లేకుండా పోయింది. గత నాలుగేళ్ళ కాలంగా ఇది మరీ ఎక్కువైపోయింది. దీంతో సీనియర్ నేతలు..పార్టీ శ్రేయస్సు కోరే వారు కూడా పెద్దగా చంద్రబాబుకు సలహాలు..సూచనల వంటి వాటి జోలికిపోకుండా ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు. పార్టీ శ్రేయస్సు దృష్టా ఎవరైనా గట్టిగా మాట్లాడినా చంద్రబాబు ఏ మాత్రం వినే పరిస్థితిలో లేరని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
ఇప్పుడు పార్టీ అంటే చంద్రబాబు, లోకేష్ లే తప్ప.. సీనియర్ నేతలకు కూడా పెద్దగా విలువ ఇవ్వటంలేదనే అభిప్రాయం నేతల్లోనే కాదు..మంత్రుల్లోనూ ఉంది. చంద్రబాబు తీరుతో పార్టీ నాయకులు..మంత్రుల్లో కూడా టీడీపీపై అభిమానం ప్లేస్ లో ‘అవకాశం’ అనే పదం జొరపడింది. అందుకే కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వంలో ఉంటూ అందినంద దండుకునే పనిలో ఉన్నారు. అసలు చంద్రబాబు, లోకేష్ లు ఎవరి మాటా వినని తరుణంలో తాము మాత్రం పార్టీనే నమ్ముకుని ఉంటే నష్టపోతామనే అభిప్రాయానికి వచ్చిన కారణంతో అందినంత దండుకో..అవసరానికి వాడుకో అన్న చందంగా తయారయ్యారని ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. టీడీపీలో పార్టీ అధినేత, నాయకులు, కార్యకర్తల మధ్య ఉండాల్సిన ‘కనెక్షన్’ కట్ అయిందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ లు అంతా తమ ఇష్టం ప్రకారం చేసుకుంటున్నప్పుడు ఎవరు మాత్రం పార్టీని ‘సొంతం’ చేసుకుని పనిచేస్తారని ఓ నాయకుడు ప్రశ్నించారు. డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారికే పదవులు..పెత్తనం అనే పరిస్థితి టీడీపీలో వచ్చిందని కొంత మంది పార్టీ శ్రేయోభిలాషులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సారి అధికారంలోకి వచ్చాక ఫిరాయింపు నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత సొంత పార్టీ నేతలకు దక్కలేదనే అసంతృప్తి టీడీపీ నాయకుల్లో ఉంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో పెత్తనం చంద్రబాబు, లోకేష్ లదే కావటంతో పాటు...కొంత మంది మంత్రులు కూడా తమ తమ శాఖలో ఛాన్స్ ఉన్న చోటల్లా తమ పనులు చక్కపెట్టుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల స్కామ్ లు తెలిసిన కొంత మంది మంత్రులు అయితే ఏకంగా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఉందని ఓ అధికారి వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రస్తుతం చంద్రబాబు పార్టీ నాయకులకు మాత్రం కొంత సమయం కేటాయిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ అయితే అదీ లేదనే అభిప్రాయం పార్టీ నాయకులు..క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.