చంద్రబాబు కార్యాలయంలో ఐదుగురు ఉద్యోగులపై వేటు
బాబు వస్తే జాబు వస్తుంది. ఇదీ చంద్రబాబు గత ఎన్నికల నినాదం. సర్కారు మాత్రం లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పేస్తోంది. ఆ లెక్కల్లో నిజమెంతో ఎవరికీ తెలియదు. ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగ భృతిని కూడా ఈ మధ్యే అమల్లోకి తెస్తామని ప్రకటించింది. అలాంటి చంద్రబాబు సర్కారు ఏకంగా తన కార్యాలయంలో పనిచేసే ఐదుగురు జర్నలిస్టులపై వేటు వేసింది. నాలుగేళ్లకుపైగా వారితో పనిచేయించుకుని సడన్ గా వారిని రోడ్డున పడేసింది. వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశాల వివరాలను నిత్యం మీడియాకు అందజేసేవారు. మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన తర్వాత కొద్ది కాలానికే వీరిపై వేటుపడింది. వీరంతా ఆయన టీమ్ లోని సభ్యులే. ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యలకు బాధపడి పరకాల రాజీనామా చేశారని..ఆయన రాజీనామాను ఆమోదించబోమని అప్పట్లో మంత్రి సోమిరెడ్డితోపాటు చాలా మంది టీడీపీ నేతలు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. అంత గట్టిగా మీడియా సాక్షిగా మాట్లాడిన నేతలు అందరూ ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత ఎక్స్ టెన్షన్ ఇవ్వకుండా ఎందుకు వదిలేసినట్లు?. అంటే అప్పటికి దాన్ని రాజకీయంగా వాడేసుకున్నారు..ఓ పనై పోయింది. అందుకే పరకాల పదవీ కాలం ముగిసినా కామ్ గా ఉండిపోయారు. ఆ విషయం అంతా మర్చిపోయారు.
కానీ పరకాల టీమ్ లో ఉన్న జర్నలిస్టులపై తాజాగా వేటువేశారు. దీంతో వీరంతా రోడ్డున పడాల్సి వచ్చింది. ఓ వైపు కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూ..సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే వారిని ఉద్యోగాల నుంచి తొలగించటంపై సచివాలయ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. నాలుగేళ్ల పాటు నిత్యం చంద్రబాబు సమావేశాలను ఎప్పటికప్పుడు మీడియాకు అందజేసిన వారిపై వేటు ఎందుకు వేశారన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు..ప్రభుత్వాల్లో పనిచేసిన తర్వాత మళ్ళీ ప్రధాన స్రవంతి మీడియాలోకి రావాలన్నా కూడా కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారమే. అది కేవలం కొంత మందికి మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే మరో వాదన కూడా ఉంది. పరకాల తన పదవికి రాజీనామా చేసే సమయంలోనే తన టీమ్ ను సరెండర్ చేస్తున్నానని..సర్కారు తన నిర్ణయం తాను తీసుకోవచ్చని పేర్కొన్నారని..అందుకే సీఎంవో వారిపై వేటు వేసిందని చెబుతున్నారు.