Telugu Gateway
Andhra Pradesh

సాంబశివరావు దాగుడుమూతలు

సాంబశివరావు దాగుడుమూతలు
X

మాజీ డీజీపీ సాంబశివరావు ‘దాగుడుమూతలు’ ఆట ఆడుతున్నారా?. తాజాగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయి సంచలనానికి కేంద్రం అయిన ఆయన..తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతోనూ భేటీ అయి కలకలం రేపారు. జగన్, సాంబశివరావు భేటీ టీడీపీలో పెను ప్రకంపనలు సృష్టించిందని చెప్పొచ్చు. తాజా మాజీ డీపీజీ ఇలా ప్రతిపక్ష నేతను కలవటం..ఆయన వైసీపీలో చేరతారని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించటంతో..ఒక్కసారిగా కలకలం రేగింది. వైసీపీ గెలుపు అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆయన ఆ పార్టీ వైపు మొగ్గుచూపారనే ప్రచారం జరిగింది.

అయితే జగన్ తో భేటీ తర్వాత సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే జగన్ తో సమావేశం అయ్యాయనని..ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ప్రకటించారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి ప్రకటన సరికాదన్నారు. తాజాగా ఆయన మంగళవారం నాడు అమరావతిలో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. సాంబశివరావు ఎన్నికల బరిలో నిలవాలనే ఆసక్తి ఉందనే విషయం వాస్తవమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆయన చర్యలు మాత్రం దాగుడుమూతల ఆటను తలపిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సాంబశివరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీలేదని తెలిపారు.కమ్యూనికేషన్ గ్యాప్ తో వైసీపీ నేతలు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి ఉంటారన్నారు.

Next Story
Share it