Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు@'స్వీట్ మెమరీస్

చంద్రబాబు@స్వీట్ మెమరీస్
X

గత ఎన్నికల్లో చంద్రబాబు గెలవటానికి ప్రధాన కారణాల్లో విభజన చేసిన కాంగ్రెస్ పై ఏపీ ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ఓ ప్రధాన అస్త్రంగా మారింది. అప్పటికి అదే అధికార పార్టీ కాబట్టి..చంద్రబాబుకు ఈ అంశం బాగా కలిసొచ్చింది. దీన్ని ఓ బ్రహ్మస్త్రంగా వాడుకుని బయటపడ్డారు. అదే చంద్రబాబు ఇప్పుడు ఏపీ ప్రజల్లో ప్రధాని మోడీపై ఉన్న వ్యతిరేకతను వాడుకుని మరోసారి గెలించేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నారు. నాలుగేళ్ళు బిజెపితో కలిసుండి కూడా..అన్యాయం చేశారనే వాదన తెరపైకి తెచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అంటే పోయిన సారి ఎన్నికలకు చంద్రబాబుకు కాంగ్రెస్ ఓ అస్త్రం అయితే...ఈ సారి ఎన్నికలకు బిజెపి అస్త్రంగా మారిపోయింది. పైగా పోయినసారి తీవ్ర శత్రువుగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ‘మిత్రుడి’గా కన్పిస్తున్నాడు. ఏపీని ప్రత్యేక హోదాతో ఆదుకుంటానని హామీ ఇచ్చారని ‘కార్డు’తో మరోసారి ఎన్నికల బరిలో గట్టెక్కాలని చూస్తున్నారు. ఇలా చంద్రబాబు ప్రత్యేక హోదా, కాంగ్రెస్ పై మాట్లాడిన పాత క్యాసెట్లు అన్నీ వింటే చంద్రబాబు ‘స్వీట్ మెమెరీస్’ అన్నీ బయటకు వస్తున్నాయి.

అందులో మచ్చుకు ఇది ఒకటి మాత్రమే. ‘అడ్డగోలుగా విభజన చేసి కాంగ్రెస్ పార్టీ మన పొట్ట కొట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఈ విభజన చేసింది. తలసరి ఆదాయం ఏపీలో తక్కువగా ఉండటానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మనకు రాజధాని లేదు. పరిశ్రమలు లేవు. రాహుల్...కాంగ్రెస్ నాయకులు ఏపీకి వచ్చారు. మేం తప్పు చేశామని ఒక్క మాటైనా చెప్పారా? అని నేను అడుగుతున్నా. ఈ రోజు ఈ కష్టాలకు బాధ్యులు ఎవరు అని నేను అడుగుతున్నా. నేను బయపడుతున్నానని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.’ జూన్ 5, 2017లో ముఖ్యంమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు ఇవి.

ఇదొక్కటే కాదు...చంద్రబాబునాయుడి కాంగ్రెస్ పార్టీపై..సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల పాత క్యాసెట్లు అన్నీ తీస్తే ఏపీ ప్రజలకు అసలు విషయం తెలిసిపోతుంది. మరి పొట్టకొట్టిన పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారు?. అసలు దేశంలో కాంగ్రెస్ అంత చెత్త పార్టీ ఉందా? అదీ ఒక పార్టీనా అంటూ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అవుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు టీడీపీ సన్నద్దం అవుతోంది. అయితే ప్రజలు ఈ పొత్తును ఎలా తీసుకుంటారో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. చంద్రబాబు ఎన్నికల్లో గెలవాలంటే సొంత బలం..శక్తి, ఆర్థిక వనరులతో పాటు ఓ బలమైన వ్యతిరేకతతో కూడిన అంశం ఉండాలన్న మాట.

Next Story
Share it