చంద్రబాబు ఒక్క రోజు బిల్లు 8.7 లక్షలు
ఎంతైనా చేతికి వాచీ..వేలికి ఉంగరం లేని పేద ముఖ్యమంత్రి కదా?. ఆ మాత్రం ఖర్చు పెట్టకూడదా? అన్నదే కదా మీ సందేహం. అవును. ఒక్క రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెంగుళూరు వెళ్లొచ్చినందుకు ఆయన పెట్టిన ఖర్చు అక్షరాలా 8.7 లక్షల రూపాయలు. అయితే అది కర్ణాటక ప్రభుత్వమే కట్టింది అనుకోండి. కాకపోతే చంద్రబాబు ఎంత సాదా సీదాగా ఉంటారో చెప్పటానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. నిత్యం ప్రత్యేక విమానాలు..సెవెన్ స్టార్ కు దగ్గని ఆతిధ్యం అనుభవిస్తూ తాను పేదల కోసం...అత్యంత పేదగా మారి పనిచేస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు అసలు తీరిది. ఈ విషయాన్ని బెంగుళూరు కేంద్రంగా వెలువడే ‘బెంగుళూరు మిర్రర్’ పత్రిక వెల్లడించిన సంచలన విషయం. కొద్ది రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్ డి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన సమయంలో చంద్రబాబు చేసిన హోటల్ బిల్లు ఇది. కేవలం ఒక్క రోజు కూడా పూర్తిగా అక్కడ ఉండకుండానే ఆయన 8.7 లక్షల రూపాయలు కర్ణాటక ప్రభుత్వంతో ఖర్చు పెట్టించారు.
అదే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై చేసిన వ్యయం 1,85,287 రూపాయలు అయితే...ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కోసం 1,02,457 రూపాయలు, శరద్ యాదవ్ కోసం 1, 87,457 రూపాయలు, సీతారం ఏచూరి పై 64 వేల రూపాయలు ఖర్చు పెట్టారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు తీసుకుని మరీ ఈ పత్రిక ఈ వివరాలు ప్రచురించింది. ఎంతైనా పేద చంద్రబాబు ఆ మాత్రం ఖర్చు పెట్టించడాన్ని ఎవరైనా తప్పుపడతారా?. పోన్లేండి పాపం. ఈ ఏడాది మే ఇరవై మూడో తేదీన ఉదయం 9.49నిమిషాలకు తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో దిగిన చంద్రబాబు మే ఇరవై నాలుగో తేదీ ఉదయం 5.34 గంటలకు ఖాళీ చేశారు. అంటే పదిహేడు గంటలకు గాను 8.7 లక్షల రూపాయలు చంద్రబాబు ఖర్చు చేశారంటే ఈయన ఎంత సాదా సీదా సీఎంనో అర్థం చేసుకోవచ్చు.