Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు బ్రాండ్ బాబు కాదు..‘బ్యాండ్ బాబు’!

చంద్రబాబు బ్రాండ్ బాబు కాదు..‘బ్యాండ్ బాబు’!
X

నిజంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘బ్రాండ్’ ను చూసే సింగపూర్ కంపెనీలు చకచకా రాజధాని కట్టేస్తున్నాయా?. ఆయన బ్రాండ్ ను చూసే ‘అమరావతి బాండ్లు’ హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయా?. చంద్రబాబు అంటే పడిచచ్చిపోయే ప్రదాన మీడియా అంతా అహో...చంద్రబాబు..అబ్బో చంద్రబాబు అంటూ కీర్తించేస్తున్నాయి. అంతే కాదు అసలు చంద్రబాబు బ్రాండ్ లేకపోతే ఈ బాండ్లు అమ్ముడుపోయేవే కావంటూ ఊదరగొడుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వాస్తవం వేరుగా ఉంది. బాండ్ మార్కెట్ లో 8 శాతం పైన వడ్డీ అంటేనే చాలా ఎక్కువ అన్నట్లు. కానీ అమరావతి బాండ్లపై సర్కారు చెల్లించే వడ్డీ 10.32 శాతం . ఓ రకంగా చెప్పాలంటే ఇది ‘ఫ్రస్టేషన్ సేల్’ లాంటిదే అని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే తెలంగాణ సర్కారు కు చెందిన జీహెచ్ఎంసీ కూడా బాండ్స్ మార్కెట్ ద్వారా రుణాలు సేకరించింది. రెండవ విడత సేకరించిన ఈ బాండ్లపై వడ్డీ రేటు 8.75 శాతమే.బాండ్ మార్కెట్ ధోరణులను గమనించే విశ్లేషకులు ఈ రేటే చాలా ఎక్కువ అని విమర్శిస్తున్నారు. అలాంటి అమరావతి బాండ్లను 10.32 శాతం వడ్డీ చెల్లించటానికి సర్కారు సిద్ధపడింది.

అంతే కాదు...ఈ బాండ్లకు సర్కారు గ్యారంటీ కూడా ఉంది. బాండ్ల మార్కెట్లో నే ఇది అత్యధిక వడ్డీ కావటం ఒకెత్తు అయితే...అందులో ప్రభుత్వ గ్యారంటీ అనేది మరో సానుకూల అంశం. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ల ‘బ్రాండ్’..క్రెడిబులిటీ ఏముంది?. ఎన్నికల్లోపు వీలైనంత మేర అప్పులు తీసుకొచ్చి..కాంట్రాక్టులు అప్పగించి..అందినంత దండుకోవటమే పనిగా చంద్రబాబు, నారా లోకేష్ లు పలు స్కీమ్ లకు డిజైన్ చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి అమరావతి బాండ్లకు సంబంధించిన వడ్డీ రేట్లను చంద్రబాబు ప్రభుత్వంలోని ఆర్థిక శాఖే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివిధ శాఖల వద్ద ఉన్న నిధులను తాము సర్దుబాటు చేస్తామని...అంత ఎక్కువ రేట్లతో కూడిన బాండ్లు కూడా వద్దని వారించింది. అయినా సరే చంద్రబాబు ఆర్థిక శాఖ అభ్యంతరాలను తోసిపుచ్చేసి..తాను అనుకున్నట్లు అత్యధిక వడ్డీతో బాండ్లను జారీ చేసి..అదేదో తన గొప్పతనం..తన బ్రాండ్ ఇమేజ్ అని డబ్బా కొట్టించుకోవటం చూసి అధికార వర్గాలు కూడా విస్మయానికి గురవుతున్నాయి.

సీఆర్ డీఏ ఇప్పుడు సమీకరించిన రెండు వేల కోట్ల రూపాయలతోపాటు..రాబోయే రోజుల్లో తీసుకోబోయే రుణాలపై వడ్డీ భారం పడేది ప్రజల నెత్తినే అని...ఇది ఏ రకంగా చూసుకున్నా ఈ వడ్డీ భారం చాలా ఎక్కువ అని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే తరాల భవిష్యత్ ను చంద్రబాబు ఇలా తాకట్టు పెట్టేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. వాస్తవాలు ఇలా ఉంటే అస్మదీయ మీడియా ద్వారా చంద్రబాబు ఎవరూ సాధించలేని సక్సెస్ సాధించినట్లు అస్మదీయ పత్రికలు హోరెత్తిస్తున్నాయి.

Next Story
Share it