Telugu Gateway
Politics

కాంగ్రెస్ పత్రికపై ‘అనిల్’ 5000 కోట్ల పరువు నష్టం దావా

కాంగ్రెస్ పత్రికపై ‘అనిల్’ 5000 కోట్ల పరువు నష్టం దావా
X

రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంటే...అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అనిల్ అంబానీ పలువురు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. తమ కంపెనీలపై తప్పుడు ప్రచారం ఆపకపోతే పరువు నష్టం కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజాగా అనిల్ అంబానీకి చెందిన సంస్థలు కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్ పై 5000 కోట్లకు, మరో కాంగ్రెస్ నేతపై 5000 కోట్లకు పరువు నష్టం దావా వేశాయి. ఈ వ్యవహారం అటు రాజకీయ, ఇటు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాఫెల్ డీల్ వచ్చే ఎన్నికల్లో కీలక అంశంగా మారనున్న తరుణంలో ఈ పోరు ఎటువైపు మళ్లుతుందనేది ఆసక్తికర పరిణామం. నేషనల్ హెరాల్డ్ లో రాఫెల్ డీల్ కు సంబంధించి ప్రచురించిన కథనాలు అభ్యంతరకరంగా..తమ కంపెనీల ప్రతిష్టను దిగజార్చేవిగా ఉన్నాయని రిలయన్స్ ఆరోపిస్తోంది.

నేషనల్ హెరాల్డ్ పై ఐదు వేల కోట్లకు, గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ నేత శక్తి సిన్హ్ గోహిల్ పై 5000 కోట్ల కు పరువు నష్టం దావా వేశారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ సంస్థలు ఈ రెండు కేసులు దాఖలు చేశాయి. తొలి సూట్ నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ పై దాఖలైంది. రాఫెల్ డీల్ పై ఇష్టానుసారం విమర్శలు చేసిన గోహెల్ పై మరో ఐదు వేల కోట్లకు నష్టపరిహారం కేసు దాఖలు చేశారు. రిలయన్స్ సంస్థలు పరువు నష్టం కేసులు దాఖలు చేయటం, ఈ కేసుకు సంబంధించి సమాధానం చెప్పాల్సిందిగా ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 7 నాటికి ప్రతివాదులు తమ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓ కార్పొరేట్ సంస్థ ఇలా రాజకీయ పార్టీతో ఢీకొట్టడంతో కూడా ఇదే మొదటిసారి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it