Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుపై వ్యతిరేకత తగ్గించే పనిలో జగన్!

చంద్రబాబుపై వ్యతిరేకత తగ్గించే పనిలో జగన్!
X

ఆంధ్రప్రదేశ్ లో రకరకాల కారణంతో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వ్యతిరేకత పెరుగుతోంది. దీనికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. అయితే పెరిగే ఈ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవాల్సిన వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వరస పెట్టి సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటూ ఆ పార్టీ నాయకులు..క్యాడర్లో కలకలం రేపుతున్నారు. తాజాగా కాపు రిజర్వేషన్లకు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. చాలా సంవత్సరాల పాటు నాన్చి..నాన్చి...మంజునాథ కమిషన్ వేసి కూడా చాలా కాలం సాగదీశారు. చివర్లో కమిషన్ ఛైర్మన్ మంజునాథ లేకుండానే కేవలం కమిటీ సభ్యులతో ఓ తూతూమంత్రపు నివేదిక ఇప్పించేసి..దాన్ని అసెంబ్లీలో పెట్టి ఓకే చేయించుకుని..బంతిని మోడీ కోర్టులోకి నెట్టేశారు. సహజంగా ఇఛ్చిన హామీని నిలబెట్టుకోవాలసిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంటుంది. ప్రధాని మోడీ అయితే 50 శాతం పైన రిజర్వేషన్లు ఎవరు ఇస్తామన్నా అది సాధ్యం కాదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. అయితే ఏపీలో కాపు రిజర్వేషన్లకు సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నది చంద్రబాబునాయుడు.

కానీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తన సెల్ఫ్ గోల్ వ్యాఖ్యలతో చంద్రబాబుపై పెరగాల్సిన వ్యతిరేకతను కాస్తా విజయవంతంగా తన వైపుకు తిప్పుకున్నారు. ఇది వైసీపీ శ్రేణులను నిశ్చేష్టులను చేస్తోంది. అంతే కాదు..గతంలో ఓ సారి కాపు రిజర్వేషన్లుకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించిన జగన్ ..ఇఫ్పుడు రివర్స్ గేర్ వేయటంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం మొదలైంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం దగ్గర నుంచి మొదలుపెట్టి డిఫెన్స్ లో ఉండాల్సిన టీడీపీ నేతలు కూడా ఎదురుదాడి చేస్తూ...జగన్ వ్యాఖ్యలను రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే పని మొదలుపెట్టారు. కాపు రిజర్వేషన్లపై హామీని నిలబెట్టుకోవాల్సింది చంద్రబాబు అయితే..తన వ్యాఖ్యల ద్వారా జగన్ కాపుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే చేశారు జగన్. పవన్ ను విమర్శించటానికి రాజకీయ అంశాలు ఎన్నో ఉన్నాయి. కానీ సడన్ గా ఎవరూ ఊహించని రీతిలో వ్యక్తిగత విమర్శలు చేసి..చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశం. వరసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వైసీపీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతున్నాయి. చాలా మంది నేతలు జగన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it