Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి..24న ఏపీ బంద్

0

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అందరూ రాజీనామా చేస్తే…తమ మాజీ ఎంపీలను కూడా తాను వారితో పంపిస్తానని..25 మంది ఎంపీలు దీక్షకు దిగితే కేంద్రమే దిగొచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోరాటం అంటే ఇలా ఉండాలి కానీ…చంద్రబాబులా లాలూచీ పోరాటం సరికాదన్నారు. సాక్ష్యాత్తూ ప్రధాని మోడీనే సభలో చంద్రబాబు ఆమోదంతోనే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని చెబుతున్నారని..హోదా హక్కును వదులుకోవటానికి చంద్రబాబు ఎవరు? అని జగన్ ప్రశ్నించారు. శుక్రవారం నాడు పార్లమెంట్ లో జరిగిన పరిణామాలు బాధాకరమన్నారు. ప్రదాని మోడీ కానీ, రాహుల్ గాంధీకానీ ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. ఒకసారి కాంగ్రెస్ ను నమ్మి, మరోసారి బిజెపిని నమ్మి మోసపోయారని..వచ్చే ఎన్నికల్లో తమకు 25 ఎంపీ సీట్లు ఇస్తే..ఎవరు హోదా కోసం సంతకం చేస్తారో వారికే మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఏపీ ప్రజలు ఈ విషయంపై గట్టిగా ఆలోచించాలన్నారు. అవిశ్వాస చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై  శనివారం జగన్ స్పందించారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేయనందుకు నిరసనగా ఈ నెల 24న ఏపీ బంద్ కు జగన్ పిలుపునిచ్చారు. ఈ బంద్ కు అన్ని పార్టీలు..సంఘాలు మద్దతు ఇవ్వాలని జగన్ కోరారు. గతంలో తాము ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే వెటకారం చేసిన వారే ఇప్పుడు తామేదో ఛాంపియన్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

- Advertisement -

తిరుపతిలో ఎన్నికల వేళ తానే ప్రత్యేక హోదాను 10 ఏళ్లు ఇస్తానని చెప్పిన మాటలు ప్రధాని మోడీకి గుర్తుకు రాలేదన్నారు.  ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు ప్రధాని గారికి గుర్తుకు రాలేదు. ప్రత్యేక హోదా వస్తనే పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు లభిస్తాయి. టాక్స్‌ మినహాయింపు , జీఎస్టీలు కట్టాల్సిన పని ఉండదు. ఈ వెసులుబాటుతో కంపెనీలు ముందుకువస్తాయి. కానీ ఇంతటి కీలకమైన విషయంలో రాజీపడటానికి చంద్రబాబు ఎవరు? ఏపీ ప్రజల హక్కును తాకట్టు పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబులకు ఎవరిచ్చారు?’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.
మోదీ మాట్లాడిన మాటలు బాధ కలిగిస్తే.. రాహుల్‌ గాంధీ ప్రసంగంలో కూడా అర నిమిషం కూడా ఏపీ గురించి లేదు. ఆ అర నిమిషంలో ప్రత్యేక హోదా ఇచ్చే ధర్మం తమపై ఉంది. ఇవ్వాలని అనే మాటలు కూడా ఆయన నోటి నుంచి రాలేదు. గల్లా జయదేవ్‌ ప్రసంగంలో మాట్లాడిన మాటలు గత నాలుగేళ్లుగా మేం చెబుతున్నవి కాదా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా గురించి మేం మాట్లాడిన మాటలు అసెంబ్లీలో చూడండి. రికార్డ్స్‌ తిరిగేయండి. యువభేరిల్లో చూడండి.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా చూడండి.

నిరాహార దీక్షలు సందర్భంగా.. మేం మాట్లాడిన మాటలు.. గత నాలుగన్నరేళ్లుగా చెప్పిన మాటలే గల్లా జయదేవ్‌ తన ప్రసంగంలో చెప్పారు. ప్రత్యేక హోదా అవసరం లేదని, కోడలు మగపిల్లాడు కంటానంటే అత్త వద్దంటుందా? అదేమన్నా సంజీవని అంటూ చంద్రబాబు దారుణంగా మాట్లాడారు’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ‘ప్రజాప్రతినిధులకు ఓ అవగాహన అని అసెంబ్లీలో చంద్రబాబు ఓ పుస్తకాన్ని జారీ చేశారు. మహానాడు 2017లోనూ హోదా కలిగిన, లేని రాష్ట్రాలకు తేడా ఏముంది? తేడా లేదు. అభివృద్ధి శూన్యం. ఇది కేవలం ఉనికి కోసమే ప్రతిపక్షాలు ఆరాటమని చంద్రబాబు తీర్మానం చేయలేదా? ఆ అవగాహన బుక్‌ చూస్తే.. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు.. మహానాడులో చెప్పిన మాటలు ఇంచుమించు ఒకటే.. సెప్టెంబర్‌ 7, 2016న, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్యాకేజీ అని చెప్పి చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేసినపుడు బాబు మంత్రులు కేంద్ర ‍ప్రభుత్వంలో లేరా? ఆ తర్వాత బాబుతో చర్చించి ఈ ప్యాకేజీ ఇస్తున్నట్లు వారు చెప్పడం.. దానికి బాబు కృతజ్ఞతలు తెలుపడం నిజం కాదా’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.