Telugu Gateway
Andhra Pradesh

టీటీడీ విషయంలో ‘చంద్రబాబు మరో సెల్ఫ్ గోల్’

టీటీడీ విషయంలో ‘చంద్రబాబు మరో సెల్ఫ్ గోల్’
X

కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధి ‘తిరుమల’ను వివాదం చేస్తున్నది టీటీడీ బోర్డా?. లేక చంద్రబాబు సర్కారా?. చరిత్రలో ఎన్నడూలేని రీతిలో ఏకంగా ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకూ భక్తులకు దర్శనాలు బంద్ అంటూ టీటీడీ బోర్డు ప్రకటించింది. తీరా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి పరిమిత సంఖ్యలో అయినా భక్తులను అనుమతించాలని ఆదేశించారు. సంప్రదాయాలను బ్రేక్ చేయవద్దని సూచించారు. మహా సంప్రోక్షణ ఉంటుందని..ఈ సమయంలో దర్శనానికి వస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రావొద్దని ప్రచారం చేయటంలో తప్పు లేదు కానీ..అసలు కొండపై ఎవరినీ దర్శనాలకు అనుమతించమని బోర్డు ప్రకటించటంతోపాటు భక్తులతోపాటు అందరిలో అనుమానాలు తలెత్తాయి. అది ఎక్కడ వరకూ పోయింది అంటే ఏకంగా బ్రహ్మంగారి కాలజ్ణానంలో చెప్పినట్లు తిరుమలకు పోయే దారులు మూసుకుపోతాయి...కొంత మంది అక్కడి సంపద దోచుకుంటారు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు..పోస్టులు భారీ ఎత్తున హల్ చల్ చేశాయి. టీటీడీ బోర్డునిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

అంతకు ముందే టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయంటూ దేవాలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ తరుణంలో అసలు రోజులకు రోజులు అసలు దర్శనాలకే భక్తులను అనుమతించేదిలేదని ప్రకటించటం పెద్ద దుమారమే రేపింది. తిరుమలలోని సంప్రదాయాలు..పద్దతులు ఏ మాత్రం తెలియన అనిల్ కుమార్ సింఘాల్ వంటి వారిని టీటీడీ ఈవో గా నియమించటమే ఇలాంటి సమస్యలకు కారణం అనే విమర్శలూ విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపటంతో చంద్రబాబు, ఈవో సింఘాల్ లు ఇప్పుడు రివర్స్ గేర్ వేశారు. భక్తులను అనుమతించరాదని బోర్డులో నిర్ణయం తీసుకుని..ఇప్పుడు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని సింఘాల్ ప్రకటించటం విశేషం.

Next Story
Share it