Telugu Gateway
Telangana

ఏపీకి ‘ప్రత్యేక హోదా’పై టీఆర్ఎస్ రివర్స్ గేర్!

ఏపీకి ‘ప్రత్యేక హోదా’పై టీఆర్ఎస్ రివర్స్ గేర్!
X

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రివర్స్ గేర్ వేసింది. విభజన చట్టంలో ఉన్న వాటికే మద్దతు ఇస్తామని..ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమ పరిశ్రమలు ఏపీకి వెళ్లవా? అంటూ లోక్ సభలో టీఆర్ఎస్ ఉపనేత జి. వినోద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గతంలో సీఎం కెసీఆర్ ఓ విలేకరుల సమావేశంలో స్వయంగా అప్పటి ప్రధాని చేసిన ప్రకటన ఇది..ప్రత్యేక హోదా ఇస్తారో..ఇవ్వరో తేల్చేయాలి. ఈ లొల్లి ఏంది అంటూ వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత కూడా పలుమార్లు ఏపీకి ప్రత్యేక హోదాకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. కానీ ఇప్పుడు కేంద్రంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం దూరంగా ఉన్నారు. పైగా కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి వచ్చే నిధులు ఆగిపోతాయంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

అంతే కాదు..మోడీతో కలసి సాగేందుకే సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు పంపుతోంది టీఆర్ఎస్. అయితే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించటానికి మాత్రం ‘కాళేశ్వరం ప్రాజెక్టు’కు వ్యతిరేకంగా చంద్రబాబు లేఖ రాసిన అంశాన్ని టీఆర్ఎస్ ఎంపీలు తెరపైకి తెస్తున్నారు. గత కొంత కాలంగా కెసీఆర్ మోడీ సర్కారు విషయంలో సాఫ్ట్ కార్నర్ తోనే ముందుకెళుతున్నారు. ఇఫ్పుడు ఏకంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని టీఆర్ఎస్ బహిరంగంగా వ్యతిరేకించటం రాజకీయంగా కీలకంగా మారనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి లాభం చేస్తుందా? లేక నష్టం చేస్తుందా? అన్న అంశంపై ఇప్పుడు తర్జనభర్జనలు పడుతున్నారు.

Next Story
Share it