టీఆర్ఎస్ ఆఫీసులు...69 కోట్ల భూమి..89 లక్షలకే!

అధికారంలో ఉంటే ఏ పార్టీ అయినా అంతే. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కూడా ఈ విషయాన్నే రుజువు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీని కోసం ప్రభుత్వ నుంచి కారుచౌకగా భూమి తీసుకోవాలని నిర్ణయించుంది. అది ఎంతలా అంటే...69 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కేవలం కనీసం కోటి రూపాయలకు కూడా కాకుండా 89 లక్షల రూపాయలకే దక్కించుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు అంతా రంగం సిద్ధం అయింది. ఇదే తరహాలో మిగిలిన పార్టీలు కోరితే ఇస్తారా? అంటే ‘అందుబాటు’ను బట్టి నిర్ణయాలు ఉంటాయి. అధికార పార్టీకి సౌలభ్యం కాస్త ఎక్కువే ఉంటుంది కదా?. 24 చోట్ల మొత్తం భూమిని 89 లక్షల రూపాయలకే కేటాయించనున్నారు. అదీ ఏ లెక్కనో తెలుసా?. గజం వంద రూపాయల లెక్క అట. ఇప్పటివరకూ పార్టీ కార్యాలయాలకు ట్రస్టుల పేరుతో భూమి ఇవ్వగా.. ఇకపై నేరుగా పార్టీ కార్యాలయాల పేరుపైనే ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ కార్యాలయాలకు ఇచ్చే భూముల్లో అత్యధికం మునిసిపల్ శాఖకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. వరంగల్ అర్బన్, రూరల్ పార్టీ కార్యాలయం కోసం హన్మకొండలోని రూ.14.52 కోట్ల విలువైన కుడా స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో పుర పాలక శాఖ భూములను, నాగర్‌కర్నూలు, ఆదిలాబాద్‌లో రోడ్లు భవనాల శాఖ, మహబూబ్‌నగర్‌లో నీటిపారుదల శాఖ, మెదక్‌లో గృహనిర్మాణ శాఖ భూములు కేటాయించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఏపీలో కూడా అక్కడి ప్రభుత్వం ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఆయా పార్టీలకు భూములు కేటాయించాలని ప్రతిపాదించింది. అంటే సహజంగా అధికార పార్టీనే ఎక్కువ స్థలం పొందేందుకు వీలుగా ప్లాన్ చేసుకున్నారు.