Telugu Gateway
Andhra Pradesh

వైసీపీలోకి టీజీ వెంకటేష్!?

వైసీపీలోకి టీజీ వెంకటేష్!?
X

ఆంధ్రప్రదేశ్ లోని అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు పార్టీ మారటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వాళ్లిద్దరూ జనసేనలోకి వెళ్ళటానికి చర్చలు కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ తరుణంలో కర్నూలు జిల్లా రాజకీయాల్లో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలటం ఖాయంగా కన్పిస్తోంది. రాజ్యసభ సభ్యుడు టీ జీ వెంకటేష్ ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఏపీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బుట్టా రేణుకను, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. అప్పటి నుంచి టీజీ వెంకటేష్ లోకేష్ తీరుపై కుతకుతలాడుతున్నారు. అందుకే ఆయన బహిరంగంగానే టిక్కెట్లు ప్రకటించటానికి లోకేష్ ఎవరు?. అయినా ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ టిక్కెట్లు ఎలా ప్రకటిస్తారు అని నిలదీశారు. లోకేష్ ఏమీ పార్టీ అధ్యక్షుడు కాదు కదా? అని వ్యాఖ్యానించారు. టీజీ వెంకటేష్ ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా కూడా తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వ్యవహారంపై ఎక్కడా స్పందించకపోవటంతో ఆయన కూడా తన కుమారుడు, మంత్రి లోకేష్ కే మద్దతు ఇఛ్చినట్లు కన్పిస్తోందని టీజీ వెంకటేష్ అనుమానిస్తున్నారు.

ఎప్పటి నుంచో తాను కర్నూలు అసెంబ్లీ సీటు తన కుమారుడికి కేటాయించాల్సిందిగా కోరుతున్నానని..తాము పక్కనే ఉండగా..లోకేష్ ఇలాంటి ప్రకటన చేస్తే..ఇప్పుడు తాము లోకేష్ ఎందుకు విలువ ఇవ్వాలని టీజీ వెంకటేష్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. వైసీపీలో చేరితే అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎప్పటిలాగానే జగన్ మాత్రం పార్టీలో చేరితో రాజ్యసభ వదులుకోవాల్సి ఉంటుందని సూచించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒకట్రెండు నెలల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మంత్రి నారా లోకేష్ పై టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలకు కొంత మంది సీనియర్లు ఫోన్ చేసి...బాగా మాట్లాడారని అభినందించటం విశేషం. లోకేష్ తీరుపై పార్టీ నేతల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి ఇది ఓ ఉదాహరణ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it