Telugu Gateway
Andhra Pradesh

టీఆర్ఎస్ మద్దతు కోరిన టీడీపీ

టీఆర్ఎస్ మద్దతు కోరిన టీడీపీ
X

తెలుగుదేశం పార్టీ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు ఈ రూట్ లోకి వెళ్లింది. అందులో భాగంగానే విభజన హామీల అమలు కోసం టీఆర్ఎస్ సహకారం కోరింది. ఈ మేరకు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ళ నారాయణ, నిమ్మల కిష్టప్ప,, మాల్యాద్రిలు ఆదివారం నాడు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావుతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో టీఆర్ఎస్ లోక్ సభ నేత జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గత సమావేశాల తరహాలోనే ఈ సమావేశాల్లోనూ అవిశ్వాస తీర్మానాలు తదితర మార్గాల ద్వారా కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. టీఆర్ఎస్ తో పాటు దేశంలోని అన్ని పార్టీల నేతలను కలసి టీడీపీ ఎంపీలు మద్దతు కోరనున్నారు. దీని కోసం ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ లేఖను సిద్దం చేశారు. అన్ని పార్టీల నేతలకు ఈ లేఖను కూడా అందించనున్నారు. విభజన హామీల అమలు కు తాము టీఆర్ఎస్ మద్దతుకోరామని..దీనికి టీఆర్ఎస్ కూడా సానుకూలంగానే స్పందించిందని సుజనా చౌదరి తెలిపారు.

విభజన హామీలు అమలు చేయకపోవటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలు సమస్యలు వస్తున్నాయని ..పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని కేశవరావు వ్యాఖ్యానించారు.. అయితే టీడీపీ ఎంపీలు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తో కాకుండా పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావుతో సమావేశం కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ అధినేత ఆమోదం లేకుండా కేశవరావు సొంతంగా నిర్ణయం తీసుకోలేరు కదా? అని ఓ నేత వ్యాఖ్యానించారు. అందునా కెసీఆర్ గత కొంత కాలంగా మోడీతో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే.

Next Story
Share it