కాంగ్రెస్..టీడీపీ పొత్తుకు లైన్ క్లియర్ చేసిన ‘సిడబ్ల్యూసీ’!
ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రంగం సిద్దం అవుతోందా?. పరిణామాలు ఆ దిశగానే చకచకా ముందుకు సాగుతున్నాయి. ఆదివారం నాడు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానించారు. ఇంత కంటే ఏం కావాలి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటానికి. సీడబ్ల్యూసీలో ఏపీకి ప్రత్యేక హోదాపై తీర్మానం చేయటంతోపాటు ఇతర రాష్ట్రాల వాళ్ళు దీన్ని వ్యతిరేకించవద్దని రాహుల్ ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఇదే రాహుల్ గాంధీ గత శుక్రవారం నాడు లోక్ సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.. ఏపీ బాధిత రాష్ట్రం...దేశంలో ఇలాంటి మోడీ బాధితులు ఎంతో మంది ఉన్నారని రాజకీయ విమర్శలు చేశారే తప్ప..తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లోక్ సభ సాక్షిగా రాహుల్ గాంధీ ప్రకటించలేకపోయారు. కానీ సీడబ్ల్యూసీలో మాత్రం తీర్మానం చేసి..‘రాజకీయ ప్రయోజనం’ పొందేందుకు ఎత్తుగడ వేసినట్లు స్పష్టంగా కన్పిస్తోంది.
ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా బిజెపిపై...ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగినట్లు కన్పిస్తోంది. అందుకే సీడబ్ల్యూసీలో తీర్మానం పెట్టి ‘రాజకీయ పొత్తు’లకు లైన్ క్లియర్ చేసినట్లు కన్పిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీ, తెలంగాణల్లో పొత్తు పెట్టుకోవటం ఖాయం అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి ఓ బలమైన కారణం కావాలి. ఆ కారణాన్ని రాహుల్ గాంధీ ఇప్పుడు చంద్రబాబుకు ఇచ్చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి మోసం చేసింది కాబట్టే..కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నాం..అంతే కాదు సీడబ్ల్యూసీలోనూ తీర్మానం చేశారు. ఇంత కంటే ఏం కావాలని చంద్రబాబు చెప్పుకోవటానికి..ఆయనకు మద్దతు ఇఛ్చేవారికి.