Telugu Gateway
Andhra Pradesh

వైజాగ్ భూ స్కామ్ లో ఐఏఎఎస్ లు

వైజాగ్ భూ స్కామ్ లో ఐఏఎఎస్ లు
X

ఆంద్రప్రదేశ్ ను కుదిపేసిన విశాఖపట్నం భూ కుంభకోణంలో అర డజనుకు పైగానే ఐఏఎస్ అధికారులు ఉన్నట్లు నిగ్గుతేలింది. ఈ కుంభకోణంపై రాష్ట్ర సర్కారు వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తన నివేదికలో ఐఏఎస్ ల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ జాబితాలో గతంలో పనిచేసిన వాళ్లు కొంత మంది ఉండగా..ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న వారి పేర్లు కూడా అందులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంపై చంద్రబాబు సిట్ ను అయితే వేశారు కానీ..ఆ నివేదిక వచ్చినా దాన్ని మాత్రం ఇంత వరకూ బహిర్గతం చేయటం లేదు. అయితే ఈ భూ కుంభకోణంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మంత్రి మాత్రం తన లావాదేవీలు అన్నీ పర్పెక్ట్ గా బినామీల ద్వారా జరిపించుకుని ‘సేఫ్’గా బయటపడినట్లు చెబుతున్నారు. ఈ నివేదిక బహిర్గతం అయితే సర్కారుకు ఇబ్బంది తప్పదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ హైదరాబాద్ తర్వాత అత్యంత కీలకమైన నగరంగా వైజాగ్ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత వైజాగ్ కు ప్రాముఖ్యత మరింత పెరిగింది. దీంతో కొంత మంది ఐఏఎస్ లు అత్యంత కీలకమైన భూముల అన్యాక్రాంతానికి సహకరించి..భారీ ఎత్తున ముడుపులు అందుకున్నట్లు సిట్ విచారణలో తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా వైజాగ్ భూ స్కామ్ లో ఎన్ వోసీల దందానే అధికంగా ఉంది. ఆర్డీవోల దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్లు..కలెక్టర్లు అందరూ కలసి ఈ దందా సాగించినట్లు సిట్ విచారణలో తేల్చినట్లు సమాచారం. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కూడా అధికారులను అడ్డం పెట్టుకుని భారీగా లబ్దిపొందినట్లు చెబుతున్నారు. విశాఖపట్నంలో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వస్తే సిట్ వేసిన సర్కారు...తీరా నివేదిక వచ్చిన తర్వాత దాన్ని బహిర్గతం చేయకపోవటం వెనక మతలబు ఏమిటి? అన్నది ఇప్పుడు అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నివేదికను బహిర్గతం చేస్తారా? లేక దాన్ని రహస్యంగానే ఉంచుతారా? వేచిచూడాల్సిందే. సిట్ గుర్తించిన ఐఏఎస్ అధికారులు కొంత మంది కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.

Next Story
Share it