Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబును హడలెత్తిస్తున్న ‘సోషల్ మీడియా’

చంద్రబాబును హడలెత్తిస్తున్న ‘సోషల్ మీడియా’
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ‘సోషల్ మీడియా’ హడలెత్తిస్తోంది. ప్రధాన మీడియా అంతా సర్కారు ఇచ్చే కోట్లాది రూపాయల విలువైన ‘ఫుల్ పేజీ’ ప్రకటనలతో కుషీకుషీగా ఉంటే..చాలా సార్లు అసలు విషయాలను..వాస్తవాలను సోషల్ మీడియానే బయటపెడుతోంది. ఉదాహరణకు తిరుమలలో మహాసంప్రోరక్షణ సందర్భంగా ఏకంగా వారం రోజులపాటు దేవాలయంలోకి భక్తులు ఎవరిని అనుమతించకూడదని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుంటే..ప్రధాన మీడియా చాలా వరకూ బోర్డు నిర్ణయాన్ని రాసేసి వదిలేసింది. అదే టీడీపీ ప్రభుత్వం కాకుండా మరో ప్రభుత్వం ఉండి ఉంటే..చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు..ఇంత ఆపచారం చేస్తారా?. భక్తులకు దేవుడిని దూరం చేస్తారా? అంటూ హంగామా చేసేవారు. ప్రభుత్వాలను బట్టి పత్రికల స్టాండ్ కూడా మారుతుందనే విషయం తెలుగు పాఠకులకు కొత్తేమీ కాదు. అయితే తిరుమలలో ఎన్నోసార్లు మహాసంప్రోక్షణ జరిగినా ఎప్పుడూ భక్తులకు మాత్రం బ్రేకులు వేయలేదు.

ఓ వైపు తిరుమల పోటులో అక్రమ తవ్వకాలు జరిగి ఆభరణాలు తరలించుకుపోయారని తీవ్ర విమర్శలు వచ్చిన తరుణంలో ఏకంగా భక్తులు ఎవరినీ రానివ్వరు..సీసీటీవీలు కూడా పనిచేయవు అన్న తరహాలో నిర్ణయాలు తీసుకోవటం తో సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. టీటీడీ మాజీ ప్రదాన అర్చకులు రమణదీక్షితుల ఆరోపణలను ఎంత మంది నమ్మారో నమ్మలేదో తెలియదు కానీ..టీటీడీ భక్తులను అనుమతించరాదన్న నిర్ణయంతో మాత్రం పెద్ద దమారమే రేగింది. ప్రధాన మీడియా ఏమీ పెద్దగా ఈ అంశాన్ని లేవనెత్తకపోయినా సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు భయపడే ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ నిర్ణయాన్ని సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. టీటీడీ వంటి సంస్థ ముందు ప్రజలు/భక్తుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటుందా?.లేక తీసుకున్న నిర్ణయం వివాదస్పదం అయిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారా?. అలా ఉంది టీటీడీ పాలన.

తిరుమలలో మహాసంప్రోరక్షణ పై ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. ఆ సమయంలో నిజంగా కేవలం 25 నుంచి 30 వేల మందికి మాత్రమే దర్శనానికి వెలుసుబాటు ఉంటే...ఈ వారం రోజుల అలిపిరి దగ్గరే ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని..ఆ మేరకు భక్తులను అనుమతిస్తే సరిపోయేది. దీంతోపాటు...మహా సంప్రోక్షణ సందర్భంగా పెద్ద ఎత్తున ఎవరూ తిరుమల రావొద్దని ప్రచారం చేయటం కూడా ఉత్తమమే. కానీ ఎవరినీ అనుమతించం అని ప్రకటించటంతో అక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానాలు అందరిలో తలెత్తాయి. దీనికి తోడు బ్రహ్మంగారి కాలజ్ణానంలో చెప్పిన అంశాలు అంటూ వీడియోలు..పోస్టింగ్ లు సోషల్ మీడియాలోకి రావటంతో ఏపీ సర్కారు ఉలిక్కిపడి టీటీడీ బోర్డు నిర్ణయాన్ని సవరించాల్సిందిగా ఆదేశించింది. స్వామిజీలు కూడా టీటీడీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆలశ్యంగా అయినా సరైన నిర్ణయం తీసుకోవటంలో సోషల్ మీడియాదే కీలకపాత్ర కావటం విశేషం.

Next Story
Share it