పవన్ ఫ్యాన్స్ పై రేణూ ఫైర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొన్ని రోజులుగా రేణూ దేశాయ్ పేరుతో ఓ పోస్టు వైరల్ అవుతోంది. అందులో తీవ్రమైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను రేణూ దేశాయ్ చేసినట్లు అర్థం వచ్చేలా ఆమె ఫోటోను పెట్టి మరీ ఆ పోస్టు పెట్టారు. ఇది ఓ రాజకీయ పార్టీ పెట్టిందిగా ప్రచారంలో ఉంది. అయితే ఆ పోస్టులో ఉన్న వ్యాఖ్యలు రేణూ దేశాయ్ ఎక్కడా చేయలేదు. కానీ ఆమె అన్నట్లుగానే అవి ఉండటంతో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించాలని రేణూ దేశాయ్ కు భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ మెసేజ్ లు పెట్టారు. అందులో కొన్ని రిక్వెస్టింగ్ ఉంటే...మరికొన్ని హెచ్చరించేవిగా ఉన్నాయి. దీంతో చిర్రెత్తుకొచ్చిన రేణూ దేశాయ్ ఫేస్ బుక్ లో ఈ వ్యవహారంపై స్పందించారు. ఆమె వ్యాఖ్యలు. ‘గత ఐదేళ్లుగా నాపై వస్తున్న విమర్శలపై ఎందుకు స్పందించలేదు. ఈ విషయంలో పవన్‌కో రూల్.. నాకో రూలా? గత ఐదేళ్లుగా నన్ను అనరాని మాటలు అన్నారు. మరికొందరు మాత్రం పాపులారిటీ కోసమే రేణు ఇలా చేస్తున్నారని కామెంట్లు చేశారు.
ఇప్పుడేమో పవన్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు ఓ వ్యక్తి కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు. దీంతో కొందరు అభిమానులు పవన్‌కు మద్దతివ్వాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే.. మరికొందరు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని రేణు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా. ఇప్పుడు పవన్ పేరుకు మచ్చ వస్తుందన్న భయంతో తనని స్పందించమనడం ఎంత వరకు సబమని’ పవర్‌స్టార్ అభిమానులను ఉద్దేశించి ఆమె కామెంట్ చేశారు. తానెప్పుడూ పవన్ గురించి తప్పుగా మాట్లాడలేదని, అలా మాట్లాడమని తనని కానీ, తన పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదని’ రేణూ దేశాయ్ స్పష్టం చేశారు.