అవిశ్వాసంతో చిక్కుల్లో టీడీపీ
అవిశ్వాస తీర్మానం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందుదామని చూసిన తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా టీడీపీని తీవ్ర ఇరకాటంలో పడేసేలా ఉన్నాయి. గత కొంత కాలంగా టీడీపీ ప్రధానంగా వైసీపీ, జనసేనలు బిజెపితో కుమ్మక్కు అయి ఏపీకి అన్యాయం చేస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో రాజ్ నాధ్ సింగ్ సభలో చేసిన ప్రకటన టీడీపీని రాజకీయంగా తీవ్ర ఇరకాటంలో పడేసింది. రాజ్ నాధ్ సింగ్ తన సమాధానంలో కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్యాకేజీ కి అంగీకరించిన అంశాన్ని కూడా ప్రస్తావించకుండా..ఏపీకి కేంద్రం ఏమేమి చేసిందో చెప్పి వదిలేయటం ద్వారా ఇప్పటికీ బిజెపి, టీడీపీ బంధం కొనసాగుతుందనే సంకేతాలను ప్రజలకు పంపారు. దీంతో ఇది రాజకీయంగా టీడీపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. ఎన్డీయే నుంచి విడిపోయినా కూడా చంద్రబాబు ఇప్పటికీ తమ మిత్రుడే అని రాజ్ నాధ్ సింగ్ సభా వేదికగా ప్రకటించారు. అక్కడతో ఆగలేదు సరికదా..అది విడగొడితే విడిపోయే బంధం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు టీడీపీ నేతలను షాక్ కు గురిచేశాయి. అయితే రాజ్ నాధ్ సింగ్ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఏమి చేసినా...కూడా టీడీపీకి అవిశ్వాస తీర్మానం ఓ చేదు అనుభవాన్ని మిగల్చటం ఖాయంగా కన్పిస్తోంది. రాజ్ నాధ్ సింగ్ ఏపీ గురించి ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని.. ఏపీ రెవెన్యూలోటు భర్తీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.1500 కోట్లు ఇచ్చామన్న ఆయన.. విభజన చట్టంలో హామీలు దాదాపుగా అమలు చేశామన్నారు. మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామన్నారు. విభజన తర్వాత ఏపీ సమస్యలేంటో తమకు తెలుసు అంటూ ప్రత్యేక సాయం కింద ఏపీకి నిధులు ఇచ్చేందుకు సిద్ధమన్నారు.ఏపీకి చెందిన బిజెపి నేతలు కొంత మంది అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతకం బయటపెడతామంటూ ప్రకటించారు. తీరా చూస్తే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క విమర్శ చేయకపోగా..తమ మిత్రుడు అంటూ వ్యాఖ్యానించటంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.