ప్రియాంక చోప్రా రికార్డు
ప్రియాంక చోప్రా. బాలీవుడ్ హీరోయినే కాదు..అంతర్జాతీయంగా క్రేజ్ సంపాదించుకున్న పాపులర్ నటి. హాలీవుడ్ లో ఎంట్రీతో ఈ భామ రేంజ్ ఒక్కసారిగా మరింత పెరిగిపోయింది. తాజాగా ఓ సినిమాలో ఆమెకు నిర్మాతలు ఏకంగా ఆరున్నర కోట్ల రూపాయల పారితోషికం అందివ్వటానికి రెడీ అయ్యారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకకోవచ్చు. తాజాగా ప్రియాంక చోప్రా సామాజిక మాధ్యమాలకు సంబంధించిన అంశంలో ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని దాటేశారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 25 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా ఈ బాలీవుడ్ బ్యూటీ అభిమానులకు 25 మిలియన్ల స్ట్రాంగ్ ధన్యవాదాలు అంటూ పేర్కొంది. ప్రధాని మోడీకి ఇన్ స్ట్రాగ్రామ్ లో 13.5 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. దేశ ప్రధాని కంటే సినీ స్టార్ కు ఇంత భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉండటం విశేషం.
బాలీవుడ్ టాప్ హీరోలు అమితా బచ్చన్ 9.5 మిలియన్లు, షారుక్ ఖాన్ కు 13.3 మిలియన్లు, సల్మాన్ ఖాన్ కు 17.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యలో చాలా వరకూ ఫేక్ లైకులు ఉంటున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే ఇది అన్ని భాషల్లో ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ ఇమేజ్ పెంచుకునేందుకు ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునే కాంట్రాక్ట్ లను కూడా అప్పగిస్తున్నారు. అయితే ఈ ఫాలోవర్ల సంఖ్యలో ఏది నిజమో..ఏది అబద్దమో చెప్పటం ఒకింత కష్టంతో కూడుకున్న పనే. అయితే ఇన్ స్ట్రాగ్రామ్ లో ప్రియాంకచోప్రాకు చేరువగా ఉన్న హీరోయిన్లలో దీపికా పడుకొనే ఉన్నారు. ఆమెకు ప్రస్తుతం ఇన్ స్ట్రాగ్రామ్ లో 24.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.