Telugu Gateway
Andhra Pradesh

దోపిడీలో వైసీపీ..టీడీపీకి తేడాలేదు

దోపిడీలో వైసీపీ..టీడీపీకి తేడాలేదు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ నిరసన కవాతులో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదవాడి కొడుకు..పేదవాడుగానే ఉండాలి కానీ...ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలా? అని ప్రశ్నించారు. ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చింది నెత్తిన ఎక్కించుకుని తొక్కించుకోవటానికి కాదని హెచ్చరించారు. దోపిడీలో వైసీపీ, టీడీపీలకు తేడాలేదని వ్యాఖ్యానించారు. వైజాగ్ లో జనసేన నిర్వహించిన నిరసన కవాతుకు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ఉత్తరాంధ్రలో తిరిగితే అక్కడ వెనకబాటు తనం కన్పిస్తుందని అన్నారు. చంద్రబాబుకు జగన్ అంటే భయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ఆయనే స్వయంగా తనకు చెప్పారన్నారు. విశాఖపట్నంలో పబ్లిక్ లైబ్రరీని మంత్రి గంటా కబ్జా చేశారన్నారు. 2014లో తాను మద్దతు ఇచ్చిన టీడీపీనే తన వ్యక్తిత్వ హననానికి పాల్పడిందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీలో వివక్షాపూరిత పాలన సాగుతోందని ఆరోపించారు.

విశాఖ ఎన్నికల సభలో వైసీపీ గెలిస్తే ఫ్యాక్షన్ వస్తుందని చెప్పారని..అయితే తర్వాత తేలింది ఏమిటంటే వైసీపీ బలవంతంగా లాక్కుంటే..టీడీపీ లీగల్ గా లాక్కుంటుందని ఎద్దేవా చేశారు. లోకేష్ అంటున్నారు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు..ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతాడు అని..సీఎం కొడుకు సీఎం అయి మమ్మల్ని తొక్కాలా? అని ప్రశ్నించారు. సీఎం విజన్ 2050 అంటున్నారు. అదేమిటి అంటే లోకేష్ ని సీఎం చేయటం..2050 నాటికి మిగిలిన కుటుంబ సభ్యులు రెడీ అవుతారు. అందరూ మా నెత్తిన ఎక్కి తొక్కండి అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుంచి జనసేన ఒకటే మాటపై ఉందన్నారు.

రైల్వే జోన్ సాధించటానికి నలుగురం చాలని..లోకేష్ ముందు ఉంటే సీఎం, జగన్, తాను ఉండి రైళ్లను ఆపుతామని ప్రకటించారు. ఎలా రైల్వే జోన్ రాదో చూస్తామని వ్యాఖ్యానించారు తనపై రైల్వే కేసులు పెట్టినా దీనికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వైజాగ్ నిరసన కవాతు..పబ్లిక్ మీటింగ్ విజయవంతం కావటంతో జనసేన శ్రేణులు ఫుల్ కుషీగా ఉన్నాయి. చంద్రబాబు నవనిర్మాణ దీక్షలకు ఖర్చు పెట్టిన 80 కోట్ల రూపాయలతో వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం చేపట్టవచ్చు కదా? అని ప్రశ్నించారు. రాయలసీమలో కరువు కాబట్టి వలసలు అంటే అర్థం చేసుకోవచ్చని...ఎన్నో నదులు ఉన్న ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.

Next Story
Share it