Telugu Gateway
Andhra Pradesh

నారా లోకేష్ పై ‘పవన్ పంచ్’

నారా లోకేష్ పై ‘పవన్ పంచ్’
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరస పెట్టి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ లను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తుపాకీతో కాల్చేసినోళ్లు, దోపిడీలు చేసేవాళ్లు చ‌ట్టం నుంచి త‌ప్పించుకుని మ‌న‌ మీద పెత్త‌నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. బ్రోక‌ర్ ప‌ని చేసేవాడు కోట్లు సంపాదిస్తుంటే .. పీజీలు, పీహెచ్ డీలు చేసిన విద్యావంతులు వాడికింద ప‌నిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్య‌వ‌స్థ మారాల‌ని అన్నారు. మంత్రి లోకేష్ లాంటివారు ఏ ప‌నికి ఎంతొస్తుంది అన్నస్వార్ధంతో ఆలోచించి పాల‌సీలు చేస్తార‌ని ఆరోపించారు. రాజ‌కీయాల్లోకి రావాలని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు ధైర్యం చాల‌లేద‌ని, ధైర్యం కూడ‌గ‌ట్టుకోవ‌డానికి ద‌శాబ్ధం ప‌ట్టింద‌ని పవన్ చెప్పారు. నేను మంత్రి నారా లోకేష్ లాగా అన్ని అనుకూలంగా ఉన్న‌ప్పుడు రాజ‌కీయాల్లోకి రాలేద‌ని, ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ వాళ్ల‌కు కోపం, మాట్ల‌డ‌క‌పోతే ఆంధ్ర‌వాళ్లు తిట్టే ప‌రిస్థితుల్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని గుర్తు చేశారు.

గురువారం భీమ‌వ‌రం స‌మీపంలోని నిర్మలాదేవి ఫంక్ష‌న్ హాల్ లో డిఎన్ఆర్ క‌ళాశాల విద్యార్ధులు, భీమ‌వ‌రం, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల జ‌న‌సైనికులతో మాట్లాడిన సమయంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాజిక, రాజ‌కీయ వ్య‌వ‌స్థను మార్చ‌క‌పోతే గుండాలు, ఫ్యాక్ష్య‌నిస్టులు రాజ్య‌మేలుతార‌ని, ఏమీ ఆశించ‌కుండా స్వార్ధం లేని వ్య‌క్తులే రాజ‌కీయాల్లో ఉండాల‌ని అన్నారు. రాజ‌కీయాలు చేయాలంటే పెట్టి పుట్ట‌క్క‌ర్లేదని, ధైర్యం, తెగింపు స‌హ‌నం ఉంటే చాల‌న్నారు. ప్ర‌స్తుతం ప‌గ‌లు కూడా ఆడ‌పిల్లలు రోడ్డుపై తిర‌గ‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌తే జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన అంజెడా అని స్పష్టం చేశారు. 2019వ సంవ‌త్స‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో చాలా కీల‌క‌మ‌ని, అంద‌రూ ఓట్లు న‌మోదు చేసుకోవాల‌ని, ఓట్లు తీసేస్తే తిరిగి చేర్చే వ‌ర‌కు పోరాటం చేయాల‌న్నారు.

Next Story
Share it