Telugu Gateway
Telangana

‘అద్దె’ ఇంట్లో ఉంటే ప్రభుత్వ పథకాలు వర్తించవా!

‘అద్దె’ ఇంట్లో ఉంటే ప్రభుత్వ పథకాలు వర్తించవా!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కౌలుదారుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతోంది. అద్దెకు ఉండే వ్యక్తికి భవనంపై హక్కులు వస్తాయా? అని సీఎం కెసీఆర్ ప్రశ్నిస్తున్నారు. మరి అద్దెకుండే వ్యక్తికి ప్రభుత్వ పథకాలు వర్తించవా?. కెసీఆర్ చెప్పే నిబంధన ప్రకారం అయితే అలాగే జరగాలి. సొంత ఇళ్లు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తారా?. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో పట్టాదారు పాస్ పుస్తకాల్లో హక్కుదారు..అనుభవదారు అనే అంశాలు ఉండేవి. కొత్త పాస్ పుస్తకాల్లో అనుభవదారు కాలాన్ని తొలగించారు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తికి పది ఎకరాల స్థలం ఉంది. ఆ వ్యక్తి హైదరాబాద్ లోనో..మరో చోట ఉద్యోగం చేసుకుంటూ తన పొలాన్ని కౌలుకు ఇస్తారు. ఒక్కోసారి కరువు వల్లో..వరదల వల్లో పంట నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే పెట్టుబడి పెట్టి..కష్టపడి వ్యవసాయం చేసిన కౌలుదారుకు ఆ నష్టపరిహారం చెల్లించటం ధర్మమా?. లేక భూమి ఎవరిదో వారికి మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తాం అనటం ధర్మమా?.

ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు..తెలంగాణలోని పలు జిల్లాల్లో పట్టదారులు చాలా మందిది ఇదే పరిస్థితి. దీంతో భూ యాజమానులకు డబ్బులు వస్తున్నాయి....కానీ అసలు వ్యవసాయం చేస్తున్న కౌలుదారులు మాత్రం నడిరోడ్డుపై నిలబడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం తాను ఇవేమీ పట్టించుకోను...ఎవరి పేరుతో పొలం ఉంటుందో వారికే ప్రభుత్వం తరపున రైతుబంధు అయినా..ఏ సాయం అయినా అందుతుందని చెబుతున్నారు. దీని వల్ల తెలంగాణలో క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేసేవారు భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రైతు బంధు పథకం ప్రకారం ఎకరాకు అందించే నాలుగు వేల రూపాయలు ‘పెట్టుబడి సాయం ’ అని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉండే భూ యాజమానికి అది పెట్టుబడి సాయం ఎలా అవుతుంది. ఆ యాజమానికి కౌలుదారు నుంచి కౌలూ వస్తుంది. సర్కారు నుంచి పెట్టుబడి సాయం వస్తుంది.

అసలు ప్రభుత్వం సాయం చేయాల్సింది ఎవరైతే క్షేత్ర స్థాయిలో వ్యవసాయం చేసి..దేశానికి పంటదాన్యాలు అందిస్తున్నరో వారికి కదా?. ఇవేమీ మాకు అనవసరం..పొలం ఎవరిది అయితే వారికే ఇస్తాం అనటం ధర్మమా?. రైతు బంధు పథకం కింద అర్హత లేని వారు కూడా చాలా మంది ప్రభుత్వం నుంచి సాయం పొంది..ఆ నిధులను తమ విలాసాలకు వాడుకుంటున్న విషయాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అయినా సరే సర్కారు మాత్రం తాము అనుకున్నట్లే ముందుకు వెళతాం అని చెబుతోంది. ప్రతి మండలంలో ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. ఆయా గ్రామాల్లో ఎవరు కౌలుదారులో గుర్తించి వారికి ‘కౌలుదారు కార్డులు’ ఇవ్వటం..ఆ ఏడాది ప్రభుత్వం అందించే సాయాలు వారికి ఇవ్వటం పెద్ద కష్టం కాబోదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది.

Next Story
Share it