Telugu Gateway
Andhra Pradesh

ఒక అవిశ్వాసం...చంద్రబాబుకు మూడు షాక్ లు

ఒక అవిశ్వాసం...చంద్రబాబుకు మూడు షాక్ లు
X

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా హైఓల్టేజ్ చర్చలతో సాగిన అవిశ్వాస తీర్మానం అంతిమంగా తేల్చింది ఏమిటి?. అవిశ్వాస తీర్మానం పెట్టింది తెలుగుదేశం పార్టీనే అయినా...అది అంతిమంగా టీడీపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఉపయోగపడింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీకి మాత్రం షాక్ ల మీద షాక్ లు తగిలాయి. అంతిమ రాజకీయ ‘అస్త్రం’ అయిన అవిశ్వాస తీర్మానంతోనే ఏమీ సాధించలేని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంకా పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఎవరిపై పోరాటం చేస్తారు..ఎలా చేస్తారు?. ఇక చేయటానికి ఏముంది?. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బిజెపి ఓడించమని పిలుపునివ్వటం తప్ప. ఇదంతా ఒకెత్తు అయితే లోక్ సభలో జరిగిన చర్చ వ్యవహారం తెలుగుదేశం పార్టీని షాక్ కు గురిచేసింది. ప్రధాని నరేంద్రమోడీ సభ సాక్షిగా ..జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేలా ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారనే విషయాన్ని బహిర్గతం చేశారు. అంతే కాదు..వైసీపీ ట్రాప్ లో పడితే..మీరే నష్టపోతారని కూడా తాను చెప్పానని ప్రకటించారు.

తెలంగాణ సీఎం కెసీఆర్ అభివృద్ధిపై దృష్టి పెడుతుంటే..చంద్రబాబు నిత్యం రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంత కాలం చంద్రబాబు కేంద్రంలోని బిజెపితో వైసీపీ, జనసేన కుమ్మక్కు అయి తమపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తూ వచ్చారు. అందుకు భిన్నంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ సభ సాక్షిగా ఎన్డీయే నుంచి బయటకు వెళ్లినా చంద్రబాబు తమకు మిత్రుడే అని సభ సాక్షిగా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా తమ బంధం తెగిపోయేదికాదని వ్యాఖ్యానించటం టీడీపీ శ్రేణులను షాక్ కు గురిచేసింది. ఇక ఇప్పుడు వైసీపీ, జనసేనలు బిజెపితో కలసి చంద్రబాబు ఎలా చెప్పగలుగుతారు?. శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం పెట్టిన చంద్రబాబు రాజ్ నాధ్ సింగ్ చేసిన ‘మిత్రుడి’ వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేయలేకపోయారు. అంటే దీనర్థం రాజ్ నాధ్ వ్యాఖ్యలను చంద్రబాబు అంగీకరించినట్లేనా?. అన్న అనుమానం ప్రజల్లో రావటం ఖాయం.

ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే బిజెపి ఎంపీ హరిబాబు కూడా లోక్ సభలో చంద్రబాబు సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్పీవీని ఏర్పాటు చేయండి...శనివారం ఉదయానికి నిధులు మీ ఖాతాలో ఉంటాయి అని చెప్పి హరిబాబు అందరినీ షాక్ కు గురిచేశారు. పోనీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏమైనా తెలుగుదేశం తరపున ఏమైనా గట్టిగా హామీ ఇచ్చారా? అంటే అదీ లేదు. ఏదో మొక్కుబడిగా ఏపీకి అన్యాయం జరిగింది అని వదిలేశారు తప్ప. అంతే కాదు...లోక్ సభ ఎంపీలు అందరికీ...పలు పార్టీల నేతలను టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలతో కలసినా పెద్దగా ప్రయోజనం లేకుండానే పోయింది. అంతిమంగా అవిశ్వస తీర్మానంతో రాజకీయంగా ప్రయోజనం పొందుతామని చూసిన చంద్రబాబు అతిపెద్ద ‘లూజర’గా మిగిలారు.

Next Story
Share it