Telugu Gateway
Offbeat

మున్నార్ లో ఈ పూల సందడి చూశారా!

మున్నార్ లో ఈ పూల సందడి చూశారా!
X

మున్నార్. ప్రకృతి ప్రేమికులకు..పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. కేరళలోని ఈ ప్రాంతం ఇప్పుడు కొత్త కళ సంతరించుకుంది. పన్నెండు సంవత్సరాలకు ఓ సారి వచ్చే అరుదైన..అందమైన పూలు ఇప్పుడు మున్నార్ కొండలను కప్పేశాయి. అచ్చం దుప్పటి పరిచినట్లు కొండల నిండా అవే పూలు. వంగపూవు రంగులో ఎక్కడ చూసినా ఇవే పూలు ఇప్పుడు దర్శనం ఇస్తున్నాయి. గతంలో 2006లో ఈ పూల పండగ వచ్చిన సమయంలోనూ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున సందర్శించారు. మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఈ అరుదైన ప్రకృతి సోయగాన్ని వీక్షించేందుకు ప్రతి రోజూ వేలాదిగా ఈ ప్రాంతానికి తరలివస్తున్నారు. మున్నార్ కు సమీపంలోని అనామలై హిల్స్ ప్రాంతంలో ఈ సుందర దృశ్యాన్ని వీక్షించవచ్చు. అక్టోబర్ వరకూ సందడి కొనసాగనుంది.

అయితే ఈ అద్భుతమైన ప్రకృతి సోయగాన్ని వీక్షించేందుకు ఆగస్టు నెల ఉత్తమమైన సమయం అని చెబుతున్నారు. ఏకంగా మూడు వేల హెక్టార్లలో ఈ వినూత్న పూల సందడి ఉంటుంది. ఈ పూల చెట్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఓ సారి పూలు పూసిన తర్వాత అవి అంతరించిపోతాయి. తిరిగి మళ్లీ ఈ పూల చెట్లు రావాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ సీజన్ వచ్చింది. అవకాశం ఉంటే ఓ సారి మున్నార్ వెళితే ఈ అందమైన దృశ్యాలను వీక్షించొచ్చు. ఛాన్స్ ఉంటే ఓ సారి చూడండి మరి. పన్నెండు సంవత్సరాలకు ఓ సారి వచ్చే అరుదైన దృశ్యం ఇది.

Next Story
Share it