Telugu Gateway
Andhra Pradesh

ఎన్నికల ఏజెండాగా ‘లోకేష్ దొడ్డిదారి ఎంట్రీ’!

ఎన్నికల ఏజెండాగా ‘లోకేష్ దొడ్డిదారి ఎంట్రీ’!
X

వచ్చే ఎన్నికల్లో మంత్రి నారా లోకేష్ దొడ్డిదారి ఎంట్రీ ఓ ఎన్నికల ఏజెండాగా మారనుందా?. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆ దిశగానే సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లోకేష్ ను ఎమ్మెల్సీ చేసి..తర్వాత మంత్రి వర్గంలో తీసుకున్న విషయం తెలిసిందే. ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రాంతీయ పార్టీల్లో వారసత్వాలదే అధికారం. ఇది కాదనలేని నిజం. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిది నారా లోకేష్ అనటంలోనూ ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అయితే భవిష్యత్ నేతగా ఎదగాల్సిన వ్యక్తి ఇలా ఎమ్మెల్సీగా దొడ్డిదారిలో సభలోకి ప్రవేశించటం, ఆ తర్వాత మంత్రి అయిన తీరుపై సొంత పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో విమర్శించారు. ఓ సీటు ఎంపిక చేసుకుని గెలిచి ఉంటే కాస్త గౌరవంగా ఉండేదని..ఇఫ్పుడు విపక్షాలకు ఛాన్స్ ఇఛ్చినట్లు అయిందనే అభిప్రాయం పార్టీ నేతల్లోనూ ఉంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అయితే ఎప్పటి నుంచో ఇదే అంశాన్ని టార్గెట్ చేసింది.

ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం చేతకాదు..కానీ దొడ్డిదారిన వచ్చి దోపిడీ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేసింది..చేస్తూనే ఉంది. ఈ దొడ్డిదారి ఎంట్రీపై లోకేష్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తాజాగా లోకేష్ కు సంబంధించి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. లోకేష్ కు చేతనైతే వచ్చే ఎన్నికల్లో జన సైనికులపై ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి రావాలని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. ప్రభుత్వంలో ఇప్పుడు అంతా చంద్రబాబు, నారా లోకేష్ లదే రాజ్యం అన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన నేతలు..సీనియర్లను కూడా పక్కన పెట్టి లోకేష్ ఇష్టానుసారం చేస్తున్నారనే విమర్శలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ఈ పరిణామాలు అన్నీ గమనిస్తే వచ్చే ఎన్నికల్లో లోకేష్ దొడ్డిదారి ఎంట్రీ కీలక ఎన్నికల అంశంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it